గాంధీ ప్రమాదంలో మరణించారా?

శుక్రవారం, 15 నవంబరు 2019 (18:55 IST)
'పూజ్య బాపూజీ మహాత్మా గాంధీ ప్రమాదంలో మరణించారు'.. ఈ విషయాన్ని ఒడిశా విద్యాశాఖ ప్రచురించిన ఓ రెండు పేజీల బుక్‌లెట్‌ పేర్కొన్నారు. దీనిపై సర్వత్రా విమర్శలు ప్రారంభమయ్యాయి.

బుక్‌ లెట్‌లో ప్రమాదం కారణంగానే గాంధీ చనిపోయారని మాత్రమే కాకుండా ఆ ప్రమాదం ఎలా జరిగిందో కూడా విశధీకరించారు.. గాంధీజీ హత్యను ప్రమాదంగా చెప్పడాన్ని పలువురు మేధావులే కాకుండా వివిధ వర్గాల ప్రజలు తీవ్రంగా తప్పుపట్టారు. దీంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం దిద్దుబాటు చర్యలకు పూనుకుంది.

దీంతో ఒడిశా ప్రభుత్వ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ఈ వ్యవహారంపై ఒడిశా ప్రభుత్వం సమగ్ర విచారణకు ఆదేశించింది. ఈ విషయంపై ఒడిశా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సమీర్‌ రంజన్‌ దాస్‌ మాట్లాడుతూ..’ఆమా బాపూజీ : ఏక్‌ ఝలకా’  లో వివాదాస్పదానికి దారితీసిన అంశం ఎలా ప్రచురితమైందనే విషయంపై విచారణకు ఆదేశించామని చెప్పారు.

అలాగే ప్రచురితమైన బుక్ లెట్ ను ఉపసంహరించామని తెలిపారు.. కాగా,  గాడ్సే సానుభూతిపరులు ఉద్దేశపూర్వకంగా ఈ బుక్‌ను ప్రచురించారని సామాజిక  కార్యకర్త ప్రఫుల్లా సమంత్ర విమర్శించారు. గాడ్సే వంటి ఉన్మాది చేతిలో గాంధీ మహాత్ముడు చనిపోయారని చెప్పకుండా భావితరాలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు.

ఓ వైపు గాంధీజీ 150వ జయంత్యుత్సవాలు ఘనంగా చేస్తూ మరోవైపు ఇలా అవమానించడం తగదని హితవు పలికారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు