మహారాష్ట్రలోని మాలేగావ్‌లో పరువు హత్య జరిగింది. వేరే కులం అబ్బాయిని ప్రేమించందన్న అక్కసుతో కన్నతండ్రి తన బంధువుతో కలిసి పరువు హత్యకు పాల్పడ్డాడు. కుమార్తెకు అన్నంలో విషం కలిపి పెట్టాడు. భోజనం ఆరగించిన కుమార్తె ఇంట్లోనే చనిపోయింది. ఆ తర్వాత శవాన్ని గుట్టుచప్పుడుకాకుండా శ్మశానవాటికలో పాతిపెట్టేందుకు తీసుకెళ్లగా అక్కడ స్థానికులు చూసి పోలీసులకు సమాచారం చేరవేశారు. దీంతో ఈ పరువు హత్య వెలుగులోకి వచ్చింది.
ఈ వివరాలను పరిశీలిస్తే, మహారాష్ట్ర రాష్ట్రంలోని మాలేగాం పట్టణంలోని ఇంద్రాణి కాలనీకి చెందిన నేహాచౌదరి (18) అనే యువతి 12వ తరగతి చదువుతుంది. ఆమె అదే ప్రాంతానికి చెందిన ఓ యువకుడిని ప్రేమిస్తోంది. ఈ నేపథ్యంలో నేహా చౌదరి ఇటీవల తన పుట్టిన రోజు జరుపుకుంది. ఈ వేడుకలకు తన బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి శివారు ప్రాంతాలకు వెళ్లింది.
ఆ తర్వాత ఇంటికి తిరిగి వచ్చిన నేహాపై ఆమె తల్లిదండ్రులు శరద్, సుమితా తన సమీప బంధువు నీలేష్‌లు ఆగ్రహం వ్యక్తంచేశారు. అనంతరం కుమార్తె నేహాకు నిద్రమాత్రలు కలిపిన ఆహారం పెట్టారు. ఆ భోజనం చేసి నేహా సృహ కోల్పోవడంతో ఆమెను తల్లిదండ్రులే హతమార్చారు. నేహా మృతదేహాన్ని పూడ్చేందుకు శ్మశానవాటిక వద్దకు తీసుకువెళ్లారు.
ఈ హత్య గురించి పోలీసులకు గుర్తుతెలియని వ్యక్తి సమాచారం అందించారు. అంతలో పోలీసులు హుటాహుటిన వచ్చి నేహా మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం చేయించగా హత్య అని తేలింది. ఇతర కులం యువకుడిని ప్రేమించిందని తామే నేహాను హత్య చేశామని నిందితులు సైతం అంగీకరించారు. దీంతో పోలీసులు కూతుర్ని హతమార్చిన తల్లిదండ్రులతో హత్యకు సహకరించిన మరో వ్యక్తిని కూడా అరెస్టు చేశారు.