ఆపరేషన్ సిందూర్ ఆపలేదు.. కొనసాగుతుంది : ఇండియన్ ఎయిర్‌ఫోర్స్

ఠాగూర్

ఆదివారం, 11 మే 2025 (15:10 IST)
భారత పాకిస్థాన్ దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు, కాల్పుల విరమణ నేపథ్యంలో భారత వాయుసేన ఆదివారం కీలక ప్రకటన చేసింది. ఆపరేషన్ సిందూర్ కొనసాగుతుందని ప్రటించింది. దీనిలోభాగంగా, తమకు అప్పగించిన పనులను అద్భుత నైపుణ్యాలతో ఖచ్చితత్వంతో పూర్తి చేసినట్టు పేర్కొంది. ఈ మేరకు ఎక్స్ ఖాతాలో ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ పోస్ట్ చేసింది. అలాగే, ఆపరేషన్ సిందూర్ ఇంకా కొనసాగుతున్నందున అధికారికంగా వివరాలు వెల్లడిస్తామని తెలిపింది. తప్పుడు సమాచారానికి దూరంగా ఉండాలని ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ కోరింది. 
 
దేశ సార్వభౌమత్వానికి భంగం వాటిల్లితే చూస్తూ ఊరుకోం : భారత్ 
 
తమ దేశ సార్వభౌమత్వానికి భంగం వాటిల్లితే ఏమాత్రం ఊరుకోబోమని భారత్ తేల్చిచెప్పింది. భారత్ పాకిస్థాన్ దేశాల మధ్య కుదిరిన ఒక అవగాహనను పాకిస్థాన్ పదేపదే ఉల్లంఘిస్తోందని భారత విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ ఆరోపించారు. ఆయన శనివారం రాత్రి 11 గంటల సమయంలో విలేకరులతో మాట్లాడారు. పాకిస్థాన్ చర్యలకు భారత సాయుధ దళాలు తగిన రీతిలో బదులిస్తున్నాయని స్పష్టం చేశారు. 
 
గత కొన్ని గంటలుగా ఈ సాయంత్రం మనం కుదుర్చుకున్న అవగాహనను పాకిస్థాన్ పదేపదే ఉల్లంఘిస్తోంది అని ఆయన వ్యాఖ్యానించారు. ఇటువంటి చర్యలు ఏమాత్రం ఆమోదయోగ్యం కావని అన్నారు. ఇది ఈ రోజు ముందుగా కుదిరిన అవగాహన పూర్తిగా ఉల్లంఘించడమే అని ఆయన వ్యాఖ్యానించారు. ఇరు దేశాల మధ్య సయోధ్యకు ఈ పరిణామాలు విఘాతం కలిగిస్తాయని ఆయన పరోక్షంగా సూచించారు. 
 
భారత సాయుధ దళాలు పాకిస్థాన్ వైపు నుంచి జరుగుతున్న ఈ ఉలంఘనలకు తగిన రీతిలో సమాధానం ఇస్తున్నాయని తెలిపారు. సరిహద్దుల్లో శాంతిని కాపాడేందుకు భారత్ కట్టుబడి ఉందని, అయితే తమ సార్వభౌమత్యానికి భంగం వాటిల్లితే చూస్తూ ఊరుకోబోమని ఆయన స్పష్టం చేశారు. ఈ ఉల్లంఘనలను తక్షణమే సరిదిద్దాలని పాకిస్థాన్‌‍కు పిలుపునిచ్చారు. అయితే, మిస్రీ చేసిన ప్రకటనపై పాకిస్థాన్ వైపు నుంచి ఎలాంటి ప్రతిపాదన రాలేదు. దీంతో ఇరు దేశాల మధ్య మళ్లీ ఉద్రిక్తతలు చోటుచేసుకునే అవకాశం ఉంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు