భారత ఆర్మీలో ఇక మహిళలు తుపాకీలు పట్టనున్నారు. అన్నీ రంగాల్లో పురుషులకు ధీటుగా రాణిస్తున్న మహిళలు.. ఇకపై ఆర్మీలోనూ తమ సత్తా చాటనున్నారు. ప్రస్తుతం ఆర్మీలోని మెడికల్, లీగల్, ఎడ్యుకేషనల్, సిగ్నల్స్, ఇంజినీరింగ్ విభాగాల్లో మహిళలను నియమిస్తున్నా యుద్ధ రంగంలోకి మాత్రం వారిని ఇంకా అనుమతించడం లేదు.
గతేడాది భారత వాయుసేనలోకి మహిళలు ప్రవేశించి చరిత్ర సృష్టించారు. ముగ్గురు మహిళలు అవని చతుర్వేది, భావన కాంత్, మోహన సింగ్‌లు ఫైటర్ పైలట్లుగా ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో చేరిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత ఆర్మీ చారిత్రక నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది. త్వరలో కదన రంగంలో మహిళలు కాలుపెట్టనున్నారు. మహిళలను యుద్ధ రంగంలోకి దించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్లు ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ చెప్పుకొచ్చారు.
త్వరలోనే మిలటరీ పోలీస్‌లోకి మహిళలను తీసుకుంటామని పేర్కొన్నారు. మహిళలను జవాన్లుగా చూడాలనుకుంటున్నానని.. త్వరలోనే ఆ కల సాకారం కానున్నట్లు రావత్ చెప్పారు. మహిళలను తొలుత మిలటరీ పోలీస్ జవాన్లుగా తీసుకుంటామని చెప్పారు. జర్మనీ, ఆస్ట్రేలియా, కెనా, అమెరికా, బ్రిటన్, డెన్మార్క్, ఫిన్లాండ్, ఫ్రాన్స్ వంటి దేశాలు ఆర్మీలో మహిళా జవాన్లను కలిగివున్నాయి.