తమిళనాడు రాష్ట్రంలో జల్లికట్టు నిర్వహణకు నిబంధనలతో కూడిన జీవోను రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసింది. అందులో పేర్కొన్న నిబంధనలు ఇలా ఉన్నాయి. జల్లికట్టు నిర్వహణకు జిల్లా కలెక్టర్‌కు రాతపూర్వకంగా వినతిపత్రం సమర్పించాలి. జల్లికట్టులో పాల్గొనే ఎద్దులు, వీరులకు జిల్లా కలెక్టర్ నుంచి ముందే అనుమతి పొందాలి. జల్లికట్టుకు అనుమతులు జారీ చేసే కలెక్టర్ పోటీలు జరిగే ప్రాంతాన్ని తప్పనిసరిగా పరిశీలించాలి.
రెవెన్యూ, పశుసంవర్థక, పోలీస్, ఆరోగ్యశాఖలకు చెందిన అధికారులతో ఓ కమిటీని నియమించి, పోటీలు నిబంధనల ప్రకారం జరుగుతున్నాయా అని కలెక్టర్ పర్యవేక్షించాలి. జల్లికట్టు పోటీలో పాల్గొనే ఎద్దులకు మద్యం, మత్తు పదార్ధాలు ఇవ్వలేదని, పశువులు ఆరోగ్యంగానే ఉన్నాయని పశుసంవర్థక శాఖ వైద్యులు ధృవీకరించాలి.
వాడివాసల్ ప్రాంతానికి ఎద్దులను తీసుకువెళ్లి పరిగెత్తించే ముందు వాటి ముక్కుతాడును యజమానే తొలగించాలి. వాడివాసల్ నుంచి బయటకు పరుగెత్తే ఎద్దులను యువకులు అడ్డుకోకూడదు. పరిగెత్తే ఎద్దులను కొమ్ములు, తోకపట్టుకొని అదుపు చేయరాదు. వాడివాసల్ నుంచి పోటీ ముగిసే ప్రాంతం వరకు ఎద్దులు పరిగెత్తు సమయం 60 సెకన్ల నుంచి 120 సెకన్లలోపు ఉండాలి.
ఎద్దులను అదుపుచేసే యువకులకు వైద్యపరీక్షలు నిర్వహించి యూనిఫాం, గుర్తింపుకార్డు కలెక్టర్ పంపిణీ చేయాలి. పోటీలు జరిగే ప్రాంగణంలో గాయపడే ఎద్దులు, వీరులకు చికిత్సలు అందించేందుకు నిర్వాహకులు అంబులెన్స, వైద్యులు, పశుసంవర్ధక శాఖ వైద్యులను అందుబాటులో ఉంచుకోవాలి.