కొన్ని కారణాల వల్ల జైలుకు వెళ్లిన జయ తిరిగి అధికారంలోకి రావాలని తంజావూరులోని కాళి ఆలయంలో యజ్ఞం చేయించినప్పుడు తన పేరులో మరో అక్షరాన్ని పెట్టుకున్నట్లు తెలుస్తోంది. తన పుట్టినతేదీ ప్రకారం 5, 7 అంకెలతో మంచి జరుగుతుందనేది ఆమె నమ్మకం. అలాంటిది 75 రోజులు చావుబతుకుల మధ్య పోరాడిన జయలలిత సోమవారం.. అంటే డిసెంబర్ 5న తుదిశ్వాస విడవడం యాదృచ్ఛికం. ఆమె నమ్మకాన్ని గౌరవిస్తూ అంతిమ యాత్ర కూడా రాహుకాలం దాటాక సాయంత్రం 4.30 గంటల తర్వాత ఏర్పాటు చేశారు.
జ్యోతిష్కులను సంప్రదించనిదే ఏ నిర్ణయం కూడా తీసుకునేవారు కాదు. చిన్న పెద్ద తేడా లేకుండా అన్ని నిర్ణయాలను పంచాంగాన్ని బట్టి తీసుకునేవారు. సీఎంగా జయలలిత ఏ పథకాన్ని ప్రారంభించినా ముందు జ్యోతిష్కులను సంప్రదించేవారు. వారి సలహాల ప్రకారం తేదీ, సమయాన్ని నిర్ణయించేవారు.
ముహూర్తం సరిగాలేదని చివరి నిమిషంలో తెలియడంతో జయలలిత ఓ సారి ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని కూడా వాయిదా వేసుకున్నారు. దీన్ని బట్టి ఆమెకు జ్యోతిషంపై ఎంత నమ్మకం ఉందో అర్థం చేసుకోవచ్చు. 2001లో జయలలిత తన పేరులో అదనంగా ఇంగ్లీష్ అక్షరం 'ఏ' చేర్చుకున్నారు. ఇంగ్లీషులో 11 అక్షరాలున్న (Jayalalitha) తన పేరును 12 అక్షరాలు వచ్చేలా Jayalalithaaగా మార్చుకున్నారు.