నల్గొండ జిల్లాలో ప్రేమ విఫలమైందని ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన నల్గొండ జిల్లా నాంపల్లి మండలం గానుగుపల్లిలో చోటుచేసుకుంది. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన నేరళ్ల రఘు పీఏపల్లి మండలం గుడిపల్లి గ్రామానికి చెందిన యువతి గత కొంతకాలంగా ప్రేమించుకున్నారు. వీరువురి కులాలు వేరు కావడంతో పెద్దలు వీరి పెళ్ళికి నిరాకరించారు.
ఇటీవల ప్రేయసిని కలిసేందుకు రఘు గుడిపల్లి గ్రామానికి వెళ్లాడు. అదే సమయంలో తమ ద్విచక్ర వాహనం కనిపించడంలేదని అమ్మాయి తరుపు బంధువులు గుడిపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అనుమానాస్పదస్థితిలో రఘును పోలీసులు అదుపులోకి తీసుకొని వదిలేశారు. దీంతో మనస్తాపం చెందిన అతను పురుగులమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.