తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి పరువు నష్టం దావా కేసును గెలిచారు. దీంతో ఆయన రూ.1.10 కోట్ల పరిహారాన్ని అందుకోనున్నారు. 2017 కొడనాడు ఎస్టేట్ కేసుకు సంబంధించి ప్రధాన నిందితుడి సోదరుడు ధనపాల్ చేసిన ఆరోపణలపై పళనిస్వామి కోర్టును ఆశ్రయించగా, తాజాగా ఈ కేసులో తుదితీర్పు వెలువరించింది.
కాగా, ఈ కేసులో ప్రధాన నిందితుడి సోదరుడు ధనపాల్.. పళనిస్వామిపై తీవ్ర ఆరోపణలు చేశాడు. ఈ ఘటనల వెనక పళనిస్వామి హస్తం ఉందని ఆరోపించారు. దీంతో పళనిస్వామి పరువునష్టం దావా వేశారు.ఈ కేసులో తాజాగా మద్రాస్ హైకోర్టు తీర్పు వెలువరించింది.
ఈ సందర్భంగా జస్టిస్ ఆర్ఎంటీ టీకా రామన్ మాట్లాడుతూ.. పళనిస్వామి ప్రతిష్ఠను తగ్గించాలనే ఏకైక ఉద్దేశంతో ప్రతివాది ధనపాల్ ఈ ఆరోపణలు చేసినట్టు పేర్కొన్నారు. ధనపాల్ ఉపయోగించిన భాష పళనిస్వామిని కించపరిచేలా ఉందన్నారు. నిరాధార ఆరోపణలు చేసి పళనిస్వామి ప్రతిష్ఠను దిగజార్చినందుకు రూ. 1.1 కోట్ల పరిహారం చెల్లించాలని ఆదేశించారు.