పెద్ద నోట్ల రద్దుతో నల్లధనంతో పట్టుబడకుండా ఉండేందుకు రూ. 500, వెయ్యినోట్లను చించిపారేయడం, తగలేయడానికి వెనుకాడటం వంటివి చేయకుండా పలువురు ట్విట్టర్ ద్వారా, వాట్సాప్ ద్వారా ప్రధానికి సలహాలు ఇస్తున్నారు. అలాంటి సలహాల్లో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
నల్లధనం పాడుకాకుండా ఉండాలంటే.. "ఇండియన్ ఆర్మీ పేరిట ఒక బ్యాంకు ఖాతాను ఏర్పాటుచేయండి. ప్రజలు ఆ ఖాతాలో ఎంత డబ్బు డిపాజిట్ చేసినా.. ఎలాంటి విచారణకానీ, దర్యాప్తుకానీ ఉండదని ప్రకటించండి. దీంతో చాలామంది తమ వద్ద ఉన్న నల్లధనాన్ని ఈ ఖాతాలో డిపాజిట్ చేసే అవకాశముంటుంది. దీంతో నల్లధనం రూపంలో ఉన్న నగదు ధ్వంసం కాదు. అంతేకాకుండా ఆ సోమ్ము దేశ ప్రజల సంక్షేమం కోసం ఉపయోగించవచ్చు'' అంటూ ప్రధానికి ఇచ్చిన సలహా సోషల్ మీడియాలో హైలైట్గా నిలిచింది.
ఇదే తరహాలో భారత ప్రధాని నరేంద్ర మోడీకి హీరోయిన్ పూజా హెగ్డే ఓ సలహా ఇచ్చిన సంగతి తెలిసిందే. నల్లధనం వృధాగా పోవడం కన్నా దాన్ని ఓ మంచి కోసం ఉపయోగించడం మేలు కదా అంటూ పూజా హెగ్డే వెల్లడించారు. ట్విట్టర్ ద్వారా ఆమె స్పందిస్తూ,.. 'ప్రధాని నరేంద్రమోదీకి ఇది కేవలం ఒక సలహా మాత్రమే.. 2017 మార్చి వరకు ప్రభుత్వ ఆసుపత్రులు ఎటువంటి ప్రశ్నలు అడగకుండా రూ.500, రూ. 1000 నోట్లను డొనేషన్స్గా తీసుకుంటే నల్లధనం కనీసం ఓ మంచి పనికి ఉపయోగపడుతుంది అని సలహా ఇచ్చారు.