టికెట్ రేట్స్ పై ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యం మంచిదే: తెలంగాణ చైర్మ‌న్‌ విజేంద‌ర్ రెడ్డి

డీవీ

సోమవారం, 23 డిశెంబరు 2024 (17:11 IST)
Telangana Exhibitors Association
తెలంగాణ రాష్ట్రంలో ఇక స్పెష‌ల్ సినిమా షోస్‌కు అనుమ‌తి ఇవ్వ‌మ‌ని, టికెట్ రేట్స్‌ను కూడా పెంచ‌బోమ‌ని ఇటీవ‌ల ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి, సినిమాటోగ్ర‌ఫీ మంత్రి కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి ప్ర‌క‌టించిన నేప‌థ్యంలో తెలంగాణ ఫిల్మ్ ఛాంబ‌ర్ ఆఫ్ కామ‌ర్స్ కార్యాల‌యంలో తెలంగాణ ఎగ్జిబిట‌ర్స్ అసోషియేష‌న్ సోమ‌వారం పాత్రికేయుల స‌మావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ కార్య‌క్ర‌మంలో తెలంగాణ ఎగ్జిబిట‌ర్స్ అసోసియేష‌న్ చైర్మ‌న్‌ విజేంద‌ర్ రెడ్డి, ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఎగ్జిబిట‌ర్స్ సెక్టార్ చైర్మ‌న్ టి.ఎస్.రామ్ ప్ర‌సాద్, తెలంగాణ ఎగ్జిబిట‌ర్స్ అసోసియేష‌న్ సెక్ర‌ట‌రీ బాల గోవింద్ రాజ్, ఒంగోలు ఎగ్జిబిట‌ర్ గోరంట్ల వీరినాయుడు, తెలంగాణ ఫిల్మ్ చాంబ‌ర్‌, ఈసీ మెంబ‌ర్, డిస్ట్రిబ్యూట‌ర్‌ స‌త్య‌నారాయ‌ణ గౌడ్ త‌దిత‌రులు పాల్గొన్నారు. 
 
ఈ సంద‌ర్భంగా తెలంగాణ ఎగ్జిబిట‌ర్స్ అసోసియేష‌న్ చైర్మ‌న్‌ విజేంద‌ర్ రెడ్డి మాట్లాడుతూ ‘‘సినిమా టికెట్ ధరలను పెంచటం వలన ప్రేక్ష‌కుల‌కు క‌న్‌ఫ్యూజ‌న్ క్రియేట్ అవుతుంది. ఎందుకంటే సాధార‌ణ సినిమాల‌కు కూడా పెరిగిన టికెట్ ధ‌ర‌ల‌నే వ‌సూలు చేస్తున్నార‌ని వారు భావిస్తున్న‌ట్లు మాకు తెలిసింది. ఒక్కో సినిమాకు ఒక్కో రేటు పెట్టటం వ‌ల‌న ప్రేక్ష‌కులు ఇబ్బంది ప‌డుతున్నారు. తొలి మూడు నాలుగు రోజుల్లో మ‌ధ్య త‌ర‌గ‌తివాళ్లు, స్టూడెంట్స్‌, చిన్న చిన్న ప‌నులు చేసుకునే అభిమానులు సినిమాల‌ను ఎక్కువ‌గా చూస్తుంటారు. అలాంటి వాళ్ల ద‌గ్గ‌ర నుంచి ఎక్కువ టికెట్ రేట్స్‌ను వ‌సూలు చేయ‌టం అనేది బాధాకరం. 
 
ఇటీవ‌ల మేం టికెట్ రేట్స్‌ను ఏదైనా ఒక రేటుకి ఫిక్స్ చేయాల‌ని దిల్‌రాజుగారిని కూడా క‌లిశాం. అదే విష‌యాన్ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డిగారు ఇటీవ‌ల పేర్కొన్నారు. ఆయ‌న నిర్ణయాన్ని మేం స్వాగ‌తిస్తున్నాం. అలాగే సినిమాటోగ్ర‌ఫీ మినిష్ట‌ర్ కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డిగారు కూడా ముఖ్య‌మంత్రిగారు చెప్పిన విష‌యాన్ని మ‌రింత స్ప‌ష్టంగా చెప్పారు. ఆయ‌న కూడా మేం ప్ర‌త్యేక కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేసుకుంటున్నాం. టికెట్ రేట్స్‌ను పెంచుతూ వ‌చ్చే జీవోల‌ను ప్రేక్ష‌కులు స‌రిగ్గా గ‌మ‌నించ‌రు. అదే రేట్స్ కంటిన్యూ అవుతున్నాయ‌ని భావిస్తుంటారు. ఆ ప్ర‌భావం సినిమా క‌లెక్ష‌న్స్‌పై ప‌డుతున్నాయి. తెలుగు ఫిల్మ్ చాంబ‌ర్‌లో రీసెంట్‌గా జ‌రిగిన మీటింగ్‌లోనూ టికెట్ రేట్స్ పెంచ‌టం వ‌ల్ల‌నే ఆడియెన్స్ ఇబ్బంది ప‌డుతున్నార‌ని అనుకున్నారు. ఇప్పుడు టికెట్ రేట్స్ పెంచ‌బోమంటూ రేవంత్ రెడ్డిగారు తీసుకున్న నిర్ణ‌యంతో థియేటర్స్‌కు ప్రాణం పోసిన‌ట్ట‌య్యింది. టికెట్ రేట్స్ పెర‌గ‌కుండా ఫిక్స్‌డ్‌గా ఉంటే ఎక్కువ మంది ప్రేక్ష‌కులు సినిమాను చూసి ఆద‌రిస్తారు. ఈ సంద‌ర్భంలో ముఖ్య‌మంత్రిగారికి, సినిమాటోగ్ర‌ఫీ మినిష్ట‌ర్‌గారికి ధ‌న్య‌వాదాలు తెలియ‌జేస్తున్నాం’’ అన్నారు. 
 
ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఎగ్జిబిట‌ర్స్ సెక్టార్ చైర్మ‌న్ టి.ఎస్.రామ్ ప్ర‌సాద్ మాట్లాడుతూ ‘‘రాబోయే రోజుల్లో టికెట్ రేట్స్ పెంచబోమంటూ తెలంగాణ ప్రభుత్వం చేసిన ప్రకటన వ‌ల్ల‌ సినీ ఇండ‌స్ట్రీకి, ప్రేక్ష‌కుల‌కు మంచి జ‌రుగుతుంద‌ని భావిస్తున్నాం. బెనిఫిట్ షోస్‌, టికెట్ రేట్స్ పెంచ‌టం వ‌ద్ద‌ని చెబుతున్నాం. కొంద‌రు నిర్మాత‌లు సినిమాపై ఎక్కువ ఖ‌ర్చు పెట్టామ‌ని చెప్పి రేట్స్ పెంచ‌టం జ‌రుగుతుంది. దీని వ‌ల్ల థియేట‌ర్స్‌కు వ‌చ్చే జ‌నాలు కూడా త‌గ్గుతున్నారు. క‌లెక్ష‌న్స్‌పై ప్ర‌భావం చూపుతోంది. తెలంగాణ ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకున్న‌ట్లే ఏపీలోనూ బెనిఫిట్ షోస్ లేకుండా, టికెట్ రేట్స్ ఎక్కువ‌గా పెర‌గ‌కుండా ఉండేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఏపీ ప్ర‌భుత్వం దృష్టికి తీసుకెళ‌దామ‌ని అనుకుంటున్నాం. టికెట్ రేట్స్ పెంచ‌టం వ‌ల్ల సినిమాకు వ‌చ్చే ప్రేక్ష‌కుడిపైనే ఆ భారం ప‌డుతుంది. అలాంటి చ‌ర్య‌లు థియేట‌ర్స్‌కు న‌ష్టాన్ని క‌లిగిస్తాయే త‌ప్ప‌.. లాభాన్ని క‌లిగించ‌వు. ఇలాంటి చ‌ర్య‌లు వ‌ల్ల‌ మీడియం బ‌డ్జెట్ సినిమాలు క‌లెక్ష‌న్స్ లేక‌ దెబ్బ తింటున్నాయి. తెలంగాణ ప్ర‌భుత్వం ఇప్పుడు తీసుకున్న నిర్ణ‌యాన్ని ఏపీలోనూ అమ‌లు చేయాల‌ని రిక్వెస్ట్ చేస్తాం’’ అన్నారు. 
 
తెలంగాణ ఎగ్జిబిట‌ర్స్ అసోసియేష‌న్ సెక్ర‌ట‌రీ బాల గోవింద్ రాజ్ మాట్లాడుతూ ‘‘మూడు నాలుగేళ్ల నుంచి టికెట్ రేట్స్ పెంచ‌టం వ‌ల్ల క‌లిగే క‌న్‌ఫ్యూజ‌న్‌ను మ‌నం గ‌మ‌నిస్తూనే ఉన్నాం. ఇప్పుడు అది పీక్స్‌కి చేరుకుంది. వెయ్యి రూపాయ‌ల‌కు టికెట్ రేట్‌ను పెంచ‌టం వ‌ల్ల‌.. అమ్మో అంత రేటా! అని ప్రేక్ష‌కులు ఆశ్చ‌ర్యాన్ని వ్య‌క్తం చేశారు. దాని వ‌ల్ల ఎంతో మంది థియేట‌ర్స్‌కు రాలేద‌ని మేం భావిస్తున్నాం. టికెట్ రేట్స్ ఎంత ఉన్నాయ‌నే వివ‌రాలు స‌రిగ్గా తెలియ‌క ఆడియెన్స్ స‌త‌మత‌మైన రోజులున్నాయ‌ని కూడా థియేట‌ర్స్ య‌జ‌మానులం మాట్లాడుకున్న సంద‌ర్భాలున్నాయి. దీనిపై ఓ నిర్ణ‌యం తీసుకోవాల‌ని రెండు చాంబ‌ర్స్ వాళ్ళం అనుకుంటున్నాం. టికెట్ రేట్స్‌ను ఫిక్స్‌డ్‌గా ఉండేలా చూడాల‌ని ఇప్పుడు తెలంగాణ‌లో నిర్ణ‌యం తీసుకోవ‌టం మంచి ప‌రిణామంగా భావిస్తున్నాం.  సినిమాను ఎక్కువ థియేట‌ర్స్‌లో విడుద‌ల చేయ‌టం ఎలా అనే దానిపై నిర్మాత‌లు ఆలోచించి నిర్ణ‌యించుకోవాలి. దీని వ‌ల్ల నిర్మాత‌ల‌కు కూడా మేలు క‌లుగుతుంద‌ని భావిస్తున్నాం’’ అన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు