వెస్ట్ బెంగాల్ రాష్ట్ర అధికార పార్టీ తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి ఢిల్లీలో పెద్ద దిక్కుగా ఉన్న, కేంద్ర రైల్వే శాఖా మాజీ మంత్రి ముకుల్ రాయ్ సొంత పార్టీకి రాజీనామా చేయనున్నారు. తృణమూల్ ఆవిర్భావం నుంచి ఆ పార్టీకీ సీనియర్ నేతగా, ఢిల్లీలో పెద్ద దిక్కుగా ఉంటూ వస్తున్నారు.
అయితే, పార్టీ అధినేత్రి మమతా బెనర్జీతో ఏర్పడిన మనస్పర్థల కారణంగా పార్టీకి గుడ్‌బై చెప్పాలని నిర్ణయించుకున్నారు. తృణమూల్ కాంగ్రెస్‌కు, పార్టీ పదవులకు, రాజ్యసభ సభ్యత్వానికి దుర్గా పూజల అనంతరం రాజీనామా చేస్తానని ముకుల్ రాయ్ ప్రకటించారు.
దుర్గా పూజల అనంతరం భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని ఆయన చెప్పారు. శారదా చిట్‌ఫండ్ స్కామ్ బయటకు వచ్చాక ముకుల్ రాయ్‌ని మమతా బెనర్జీ పార్టీ జనరల్ సెక్రెటరీ పదవి నుంచి తప్పించిన విషయం తెల్సిందే. అప్పటినుంచి ముకుల్ రాయ్‌ని మమతా బెనర్జీ నెమ్మదిగా పక్కనపెడుతూ వస్తున్నారు. దీనికితోడు సీఎం మమతా బెనర్జీ తీసుకుంటున్న వివాదాస్పద నిర్ణయాలు కూడా ఆయనకు ఏమాత్రం రుచించడం లేదు. దీంతో పార్టీ నుంచి వైదొలుగుతున్నట్టు అధికారికంగా ప్రకటించారు.
మరోవైపు టీఎంసీకి రాజీనామా చేసిన తర్వాత ముకుల్ రాయ్ బీజేపీలో చేరవచ్చన్న ఊహాగానాలు బలంగా వినిపిస్తున్నాయి. ఒకవేళ ముకుల్ రాయ్ బీజేపీలో చేరితే.. ఆ పార్టీకి పెద్ద ఊపు వస్తుందని రాజకీయ వేత్తలు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా బెంగాల్లో పాగా వేయాలని ప్రయత్నిస్తున్న బీజేపీకి బాగా కలిసి వస్తుందనే అంచనాలున్నాయి.