మహారాష్ట్రలో మహా కుదుపు... రెండుగా చీలిన ఎన్సీపీ... డిప్యూటీ సీఎంగా అజిత్ పవార్

ఆదివారం, 2 జులై 2023 (15:01 IST)
మహారాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనం చోటుచేసుకుంది. అధికార బీజేపీ కూటమిలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) సీనియర్ నేత అజిత్ పవర్ చేరిపోయారు. ఆ పార్టీ అధినేత శరద్ పవార్‌కు వ్యతిరేకంగా పార్టీని రెండుగా చీల్చిపారేశారు. తన వర్గానికి చెందిన దాదాపు 20 మందితో ఆయన బీజేపీలో చేరిపోయారు. ఆ తర్వాత గవర్నర్‌ను కలవడం, ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం అంతా క్షణాల్లో జరిగిపోయింది.
 
అజిత్ పవార్ స్వయానా శరద్ పవార్ అన్న కుమారుడే కావడం గమనార్హం. ఎన్సీపీకి చెందిన 29 మంది ఎమ్మెల్యేలతో రాజ్‌భవన్‌కు వెళ్ళి బీజేపీ కూటమి ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నట్టు ప్రకటించారు. ఆదివారం మొత్తం 30 మంది ఎన్సీపీ తిరుగుబాటు ఎమ్మెల్యేలు మహారాష్ట్ర గవర్నర్‌‌ను ఈ రోజు కలిశారు. 
 
వీరంతా సీఎం ఏక్‌నాథ్ షిండే ప్రభుత్వానికి మద్దతు ప్రకటించారు. ఆ తర్వాత మహారాష్ట్ర డిప్యూటీ సీఎంగా అజిత్‌ పవార్‌‌ ప్రమాణ స్వీకారం చేశారు. మరో ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో సీఎం షిండే, ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ తదితరులు పాల్గొన్నారు. 
 
మహారాష్ట్ర శాసన సభలో ప్రతిపక్ష నేత పదవికి రాజీనామా చేస్తానని ఇటీవల అజిత్ పవార్ చెప్పారు. ఈ నేపథ్యంలో తనకు మద్దతిస్తున్న ఎమ్మెల్యేలతో ఆదివారం ఆయన తన అధికార నివాసం దేవగిరిలో ఆయన సమావేశమై ఆ తర్వాత రాజ్‌భవన్‌కు చేరుకుని షిండే ప్రభుత్వానికి మద్దతు ప్రకటించి, ప్రభుత్వంలో భాగస్వామి అయ్యారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు