తమిళనాడు సీఎం జయలలిత పార్థివ దేహాన్ని చూసి తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కంటతడి పెట్టుకున్నారు. అమ్మను ఆ స్థితిలో చూసి చలించిపోయారు. రాజాజీ హాల్లోని ఆమె భౌతికకాయానికి రజనీకాంత్ తన కుటుంబసభ్యులతో కలిసి నివాళులర్పించారు. జయను చూసిన రజనీకాంత్ బావోద్వేగాన్ని అపుకోలేక అక్కడే కంటతడి పెట్టారు. ఆయన వెంట భార్య లతా రజనీకాంత్, కుమార్తె ఐశ్వర్య, అల్లుడు ధనుష్‌లు కూడా ఉన్నారు.
నివాళులర్పించిన అనంతరం రజనీకాంత్ అక్కడే ఉన్న జయ నెచ్చెలి శశికళ వద్దకు వెళ్లి ఆమెను ఓదార్చారు. కాసేపటి తర్వాత రజనీకాంత్ కుటుంబం అనంతరం అక్కడి నుంచి నిష్క్రమించారు. ఇదిలా ఉంటే.. జయకు బద్ధ శత్రువు డీఎంకే నేత కరుణానిధి కుటుంబసభ్యులు కూడా జయమ్మకు నివాళులు అర్పించారు. ఉదయాన్నే విపక్ష నేత, కరుణ చిన్న కుమారుడు ఎం.కె.స్టాలిన్ రాజాజీ హాలు వద్దకు వచ్చి జయకు నివాళులర్పించారు.
అక్కడున్న ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం, శశికళ, ఇతర అన్నాడీఎంకే నేతలు, మంత్రులను ఓదార్చారు. వారికి తన ప్రగాఢ సంతాపం తెలిపారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ జయలలిత రాష్ట్రానికి చేసిన సేవలను కొనియాడారు.
దేశం ఒక విలక్షణ నేతను కోల్పోయిందని, ఆమె మరణం రాష్ట్రానికి తీరని లోటని అన్నారు. ఆమె ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఆయన వెళ్లిన కొద్దిసేపటికి కరుణానిధి కుమార్తె, రాజ్యసభ సభ్యురాలు కనిమొళి కూడా జయ భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలకు జయలలిత చేసిన సేవలను కొనియాడారు. ఆమె ప్రజల మనసుల్లో చిరకాలం గుర్తుండిపోతారని తెలిపారు.