అన్నాడీఎంకే అధినేత్రి, తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత అనారోగ్యం కారణంగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. దీంతో సోమవారం జరిగిన ఆ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను కూడా సాదాసీదాగా నిర్వహించారు. అలాగే, ఈనెలాఖరులో జరిగే దీపావళి పండుగను కూడా జరుపుకోబోమని ప్రకటించారు. అంతేకాకుండా, అమ్మ సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగివచ్చేంత వరకు తమ జీవితాల్లో వెలుగులు ఉండవని అన్నాడీఎంకే నేతలు అంటున్నారు.
కాగా, జయలలిత ఆరోగ్యం పట్ల ఆ పార్టీ కార్యకర్తలు, నాయకులు, నేతలు, అభిమానుల్లో తీవ్ర ఆందోళన నెలకొనడం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే అన్నాడీఎంకే వ్యవస్థాపక దినోత్సవం చాలా సింపుల్గా నిర్వహించామని, టపాసులు పేల్చడం, స్వీట్లు పంచుకోవడం వంటివి చేయలేదని సీనియర్ నేతలు పేర్కొన్నారు. కనీసం బ్యానర్లు కట్టడం, డెకరేషన్ చేయడం వంటి వాటి జోలికి కూడా పోలేదని, ఈ ఏడాది దీపావళి పండగ కూడా చేసుకోమని అన్నాడీఎంకే నాయకులు ఈ సందర్భంగా చెప్పారు.