దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఓ సాధారణ కార్యకర్తగా మారిపోయారు. వేలాది మంది కార్యకర్తలతో కలిసి ఆరుబయట కూర్చొని భోజనం చేశారు. ఈ అరుదైన దృశ్యం ఆయన ప్రాతినిథ్యం వహిస్తున్న వారణాసిలో జరిగింది. ఆ తర్వాత కార్యకర్తలతో కలిసి భోజనం చేస్తున్న ఫోటోను బీజేపీ ట్విట్టర్లో పోస్ట్ చేసింది. ఇలాంటి సమానత్వం ఒక్క బీజేపీలోనే సాధ్యమంటూ ట్వీట్ చేసింది. ఇంతకు ప్రధాని మోడీ కార్యకర్తలతో కలిసి భోజనం ఎందుకు చేశారన్నదే కదా మీ సందేహం. అయితే, ఈ కథనం చదవండి.
వచ్చే యేడాది ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో వారణాసిలో గురువారం వేలాదిమంది కార్యకర్తలనుద్దేశించి ప్రధాని ప్రసంగించారు. ఈ కార్యక్రమానికి ఓ ప్రత్యేకత కూడా ఉంది. కార్యకర్తలంతా ఎవరి భోజనం వారే తెచ్చుకోవాలంటూ సభా నిర్వాహకులు ముందే పిలుపునిచ్చారు. దీంతో ప్రధాని నరేంద్ర మోడీ కూడా తన వెంట బాక్సు తెచ్చుకున్నారు.