తమిళనాట అన్నాడీఎంకే రెబల్ ఓపీఎస్ సీఎం పళనిసామి వర్గంతో ఏకమవుతున్న వేళ... తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ పార్టీపై మరో రెండు వారాల్లో ప్రకటన వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సూపర్ స్టార్ రజనీకాంత్.. ఏపీలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పార్టీతో పొత్తు పెట్టుకుంటారని కోలీవుడ్ వర్గాల్లోనే కాకుండా తమిళనాట జోరుగా ప్రచారం సాగుతోంది. నిరాడంబరంగా వుండే రజనీ, పవన్ అటు తమిళ, ఇటు ఏపీలో తిరుగులేని రాజకీయ నేతలుగా ఎదుగుతారని రాజకీయ పండితులు అప్పుడే జోస్యం చెప్తున్నారు.
అంతేగాకుండా తమిళనాడులోని తెలుగు ప్రజలు ప్రభావం చూపే ప్రాంతాలు, ఏపీలో కొన్ని తమిళ ప్రజల ప్రభావం చూపే ప్రాంతాలు వున్నందున రజనీ, పవన్‌లు పొత్తుపెట్టుకోవడం మంచిదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అదే జరిగితే ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేపట్టే దిశగా ఎన్నికల సందర్భంగా ప్రచారం చేసే వీలుంటుందని వారు సూచిస్తున్నారు.
వీరిద్దరికీ మంచి క్రేజున్న ఇరు రాష్ట్రాల్లో రాణించాలంటే ఇరు పార్టీలు ఏకం కావాలని రాజకీయ పండితులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. తెలుగులో జనసేన, తమిళంలో మక్కల్ సేనై (జనసేన) పేరుతో రజనీ కాంత్ పార్టీ పేరు వుంటుందని తమిళనాడులో వార్తలొస్తున్నాయి.