జేఎంఎం మునిగిపోతున్న నావ : కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్

ఠాగూర్

బుధవారం, 6 నవంబరు 2024 (11:52 IST)
జార్ఖండ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముమ్మరంగా సాగుతుంది. జేఎంఎం మునిగిపోతున్న నావ వంటిదని కేంద్ర రక్షణ శాఖామంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. జేఎంఎం మునిగిపోతున్న నావ అని గ్రహించడం వల్లే మండల్ ముర్ము భారతీయ జనతా పార్టీలో చేరారని ఆయన వ్యాఖ్యానించారు. కాగా, 81 మంది సభ్యులున్న జార్ఖండ్ అసెంబ్లీకి ఈ నెల 13, 20 తేదీల్లో రెండు దశల్లో పోలింగ్ జరగనుండగా.. నవంబరు 23వ తేదీన ఫలితాలు వెల్లడికానున్నాయి.
 
ఈ ఎన్నికల ప్రచారంలో రాజ్‌నాథ్ సింగ్ పాల్గొని మాట్లాడుతూ, రాష్ట్ర అభివృద్ధి విషయంలో జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) అధినేత హేమంత్ సోరెన్ నేతృత్వంలోని ఇండియా కూటమి టపాసులా పేలితే.. భారతీయ జనతా పార్టీ శక్తిమంతమైన రాకెట్లా దూసుకెళ్తూ రాష్ట్రాన్ని సరికొత్త శిఖరాలకు తీసుకెళ్తుందన్నారు. 
 
సోరెన్ ప్రతిపాదకుడు మండల్ ముర్ము భాజపాలో చేరిన విషయంపై మాట్లాడుతూ జేఎంఎం మునిగిపోతున్న నావ అని తెలుసు కాబట్టే అతడు తమ పార్టీలో చేరారని అన్నారు. ఇదంతా చూస్తుంటే రాష్ట్రంలో ఎవరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారో స్పష్టమవుతోందని వ్యాఖ్యానించారు.
 
ప్రస్తుత ప్రభుత్వం ఆదివాసీలను అణచివేస్తూ.. వారి ప్రయోజనాలకు విరుద్ధంగా పనిచేస్తోందని దుయ్యబట్టారు. చొరబాటుదారులు రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని.. ఆదివాసీ జనాభా తగ్గిపోతోందని ఆందోళన వ్యక్తం చేశారు. బీజేపీకి అధికారం ఇస్తే జార్ఖండ్‌ను అభివృద్ధి చెందిన రాష్ట్రాల వరుసలో నిలబెడతామని హామీ ఇచ్చారు. 2027 నాటికి అమెరికా, చైనాల తర్వాత భారత్ మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారుతుందని రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు