భార్య అనుమతి లేకుండా చేయడం కూడా గోప్యత ఉల్లంఘనే : హర్యానా హైకోర్టు

మంగళవారం, 14 డిశెంబరు 2021 (07:48 IST)
భార్యకు తెలియకుండా ఆమె ఫోన్ సంభాషణలను రికార్డు చేయడం కూడా వ్యక్తిగత గోప్యత ఉల్లంఘన కిందకే వస్తుందని పంజాబ్ - హర్యానా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ మేరకు ఓ విడాకుల కేసు విచారణ సందర్భంగా ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. 
 
తాజాగా వెల్లడైన ఈ కేసు వివరాలను పరిశీలిస్తే, పంజాబ్ రాష్ట్రం భటిండాకు చెందిన ఓ జంట గత 2009లో పెద్దల సమక్షంలో ఒక్కటయ్యారు. వీరి దాంపత్య జీవితానికి గుర్తుగా ఓ కుమార్తె కూడా ఉంది. అయితే, భార్యాభర్తల మధ్య ఏర్పడిన మనస్పర్థల కారణంగా ఈ జంట విడిపోవాలని నిర్ణయించుకుంది. దీంతో గత 2017లో విడాకులు కావాలంటూ భర్త భటిండాలోని కుటుంబ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. 
 
ఈ కేసు విచారణలో భాగంగా, తన భార్య తనతో పాటు ఇతరులతో మాట్లాడిన సంభాషణలకు సంబంధించి సీడీని సమర్పించేందుకు కోర్టు అనుమతి కోరారు. అందుకు భటిండా కోర్టు అనుమతి ఇచ్చింది. దీన్ని వ్యతిరేకిస్తూ ఆమె ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. తన అనుమతి లేకుండా రికార్డు చేసిన మాటలను సాక్ష్యంగా ఎలా పరిగణిస్తారంటూ హైకోర్టులో సవాల్ చేశారు. 
 
ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు న్యాయస్థానం... భార్య అనుమతి లేకుండా ఆమె సంభాషణలను నమోదు చేయడం గోప్యత ఉల్లంఘన కిందకే వస్తుందని న్యాయమూర్తి జస్టిస్ లిసా గిల్ కీలక వ్యాఖ్యలు చేశారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు