ఓ జిలేబీ తండ్రీకుమారుడిని కలిపింది. చూడగానే నోరూరించే జిలేబీ ఎలా తండ్రీకుమారుడిని కలిపిందా? కథేంటో తెలుసుకోవాలా? అయితే ఈ స్టోరీ చదవండి. వివరాల్లోకి వెళితే.. బీహార్‌లోని సమస్తీపూర్ జిల్లా విభూతినగర్‌లో 2010లో ఆరేళ్ల బాలుడు కనిపించకుండా పోయాడు. అతని కోసం కుటుంబ సభ్యులు ఎక్కడెక్కడో వెతికారు. కానీ బాలుడి ఆచూకీ తెలుసుకోలేకపోయారు.
ఆ బాలుడు కూడా తల్లిదండ్రులకు దూరమై ఏడేళ్ల క్రితం బీహార్ నుంచి హర్యానా చేరుకున్నాడు. అక్కడి పోలీసులు అతనిని మాధవ్ బాల అనే ఆశ్రమంలో చేర్పించారు. ఆశ్రమంలోని అధికారులు అడిగితే ఆ బాలుడు తన తల్లిదండ్రుల వివరాలను బయటికి చెప్పలేకపోయాడు. కానీ తన తండ్రితో పాటు సర్మన్ చౌక్‌కు వెళ్లి జిలేజీలు తిన్న విషయం మాత్రం ఆ బాలుడికి గుర్తుంది.
ఈ విషయాన్ని ఓ స్వచ్ఛంధ సంస్థ అధికారులకు ఆశ్రమ అధికారులు తెలిపారు. దీంతో సర్మన్ చౌక్ వివరాలను స్వచ్ఛంధ సంస్థ గూగుల్‌లో సెర్చ్ చేసి.. బాలుడి వివరాలు తెలుసుకున్నారు. ఆపై స్థానిక పోలీసుల సాయంతో ఆ బాలుడిని సురక్షితంగా అతని కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఇలా జిలేజీ సెంటర్‌లో తల్లీ కుమారులు కలిసి తిన్న జిలేబీ ఆ ఇద్దరినీ మళ్లీ కలిపింది.