బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కుమారుడు జై షా కంపెనీ పెరుగుదల, ఆయన ఆస్తులపై విచారణ జరిపించాలని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరీ డిమాండ్ చేశారు. గత మూడేళ్ళ కాలంలో అమిత్ షా కుమారుడి కంపెనీ పెరుగుదల ఏకంగా 16 వేల రెట్లు ఉన్నట్టు ఓ వెబ్ పోర్టల్ సంచలన కథనాన్ని ప్రచురించింది.
దీనిపై సీతారాం ఏచూరి స్పందిస్తూ... బీజేపీ పాలిత రాష్ట్రాల్లో జరిగిన కుంభకోణాలపై ఇప్పటివరకు కేంద్రం ఎలాంటి విచారణ జరపలేదన్నారు. మధ్యప్రదేశ్‌లో వ్యాపం కుంభకోణం, బీహార్‌లో ల్యాండ్ స్కాం, లలిత్ మోడీ ఇష్యూ, బిర్లా సహారా డైరీపై ఎలాంటి విచారణ జరపలేదని ఆయన గుర్తు చేశారు.
పనామా పేపర్ల కుంభకోణంలో పాకిస్థాన్ ప్రధాని తన పదవినే కోల్పోయారని, ఈ స్కామ్‌లో కూడా ప్రధాని మోడీ పేరు ఉందని ఆయన ఆరోపించారు. తాజాగా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా కుమారుడు జై షా ఆస్తులు ఈ మూడేళ్లలో 16 వేల రెట్లు పెరిగాయని.. దీనిపైన విచారణ జరపాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం కుంభకోణాలపై విచారణ జరపకపోతే దేశవ్యాప్తంగా ఉద్యమం చేపడుతామని ఏచూరి హెచ్చరించారు.