చచ్చిపోదాం రా!... నా ఆత్మహత్యకు దెయ్యమే కారణం.. విద్యార్థిని సూసైడ్ నోట్

ఆదివారం, 19 జులై 2020 (10:54 IST)
తమిళనాడు రాష్ట్రంలోని దిండిగల్ జిల్లాలో ఓ విషాదకర సంఘటన జరిగింది. నర్సింగ్ విద్యార్థిని ఒకరు ఆత్మహత్య చేసుకుంది. ఈ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న తీరును పరిశీలిస్తే విచిత్రంగా ఉంది. చచ్చిపోదాం రమ్మని దెయ్యం పిలిచిందని ఇంట్లో ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. పైగా, తన ఆత్మహత్యకు గల కారణాలను ఆమె ఓ లేఖలో పేర్కొంది. 
 
తాజాగా వెలుగులోకి వస్తే, దిండుక్కల్ జిల్లా వేడచందూర్‌లోని ఓ గ్రామానికి చెందిన యువతి కోయంబత్తూరు వైద్య కళాశాలలో నర్సింగ్ చదువుతోంది. లాక్డౌన్ కారణంగా ఇటీవల ఇంటికి చేరుకున్న యువతి రెండు రోజుల క్రితం పుట్టిన రోజు వేడుకలు కూడా చేసుకుంది.
 
ఆ తర్వాతి నుంచి మౌనంగా మారిపోయింది. ఇంట్లో ఎవరితోనూ మాట్లాడటం మానేసింది. శుక్రవారం రాత్రి అందరూ నిద్రిస్తున్న సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని తనిఖీ చేయగా సూసైడ్ నోట్ కనిపించింది. 
 
అందులో ఆమె రాసిన విషయాలను చదివి విస్తుపోయారు. తన ఆత్మహత్యకు దెయ్యమే కారణమని పేర్కొంది. రాత్రుళ్లు నిద్రపట్టడం లేదని, చనిపోయేందుకు రావాలంటూ దెయ్యం తనను పిలుస్తోందని, ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని భయపెడుతోందని ఆ లేఖలో వాపోయింది. ఆత్మహత్యపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు