తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, చెన్నై, తిరువొట్రియూరుకు చెందిన వనిత (25) అనే మహిళకు వివాహమై భర్త బాలాజీ, ఓ యేడాదిన్నర కుమారుడు. ఉన్నాడు. బాలాజీ ఓ ప్రైవేటు కంపెనీలో పని చేస్తున్నాడు.
అయితే, బాలాజీకి సమీప బంధువైన గణపతి (36) అనే వ్యక్తి తరచూ బాలాజీ ఇంటికి వచ్చివెళ్లేవాడు. ఈ క్రమంలో వనితతో అక్రమ సంబంధం ఏర్పడింది. ఈ విషయం భర్తకు తెలిసి భార్యను పలుమార్లు హెచ్చరించాడు. అయినప్పటికీ ఆమె పట్టించుకోలేదు.
ఈ క్రమంలో ఇటీవల వనిత - గణపతిలు లేచిపోయి, కాంచీపురం జిల్లాలోని పెరుంబేడులో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని నివశించసాగారు. ఈ విషయం బాలాజీకి తెలిసింది. అంతే.. భార్య వనిత, ఆమె ప్రియుడు గణపతిలను హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు. ఇందుకోసం మంగళవారం తెల్లవారుజామున తన సహచరులతో కలిసి గుండు పెరుంబేడుకు వెళ్లాడు.
భార్య, ప్రియుడు ఉంటున్న ఇంటిలోకి చొరబడి గణపతిని చుట్టుముట్టి కత్తులతో దాడి చేశారు. అడ్డువచ్చిన భార్య వనితపై కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన గణపతి అక్కడిక్కడే మృతి చెందాడు. అనంతరం హంతకులు అక్కడి నుంచి పారిపోయారు.
రాత్రిపూట అరుపులు విన్న ఇరుగుపొరుగు ప్రజలు అక్కడికి చేరుకుని రక్తపు మడుగులో ఉన్న వనితను చెంగల్పట్టు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. దీనిపై ఫిర్యాదు అందుకున్న చెంగల్పట్టు పోలీసులు కేసు నమోదు చేసి గణపతి మృతదేహాన్ని శవపరీక్ష కోసం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ హత్య కేసుకు సంబంధించి నిందితుల కోసం గాలిస్తున్నారు.