థర్డ్ వేవ్ ఊహాగానాలు - చిన్న పిల్లలపట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలు
గురువారం, 24 జూన్ 2021 (12:25 IST)
దేశ వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య గత కొన్ని రోజులుగా తగ్గుతూ వస్తోంది. మొదటి దశలో వైరస్ వృద్ధులను టార్గెట్ చేయగా, రెండవ దశలో ఎక్కువగా యువత కరోనా బారీన పడ్డారు. ఇక మూడో దశలో 18 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలపై వైరస్ ప్రభావం ఉండనుందని అంచానా వేస్తున్నారు.
సెప్టెంబర్ లేదా అక్టోబర్ లో థర్డ్ వేవ్ ఉండొచ్చన్న అంచనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో చిన్నపిల్లలకు సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? పిల్లలు కరోనా బారినపడితే ఎలాంటి చికిత్స అందించాలన్న దానిపైనా అధ్యయనాలు మొదలయ్యాయి. ఒకవేళ పిల్లలకు ఎక్కువగా కరోనా సోకినట్టయితే ఏమేరకు చికిత్సకు సంబంధించిన మౌళిక సదుపాయాలు కల్పించాలన్నదానిపైనా అంచనా వచ్చిన ప్రభుత్వం అందుకు సంబంధించిన ఏర్పాట్లను ఇప్పటికే ప్రారంభించింది.
మరోవైపు కరోనా థర్డ్ వేవ్ పిల్లలకు బాగా ముప్పు ఉంటుందంటూ జరుగుతున్న ప్రచారానికి తగిన ఆధారాలు లేవని పలువురు నిపుణులు అంటున్నారు. 'ద లాన్సెట్' జర్నల్ కూడా ఇదే విషయాన్ని వెల్లడించింది. 'భారత్‌లో చిన్న పిల్లలకు కొవిడ్ ముప్పు' పేరుతో 'ద లాన్సెట్ కొవిడ్-19 కమిషన్ ఇండియన్ టాస్క్‌ఫోర్స్'లో భాగంగా ప్రముఖ పిల్లల వైద్య నిపుణులు వివిధ అంశాలను పరిశీలించి నివేదిక రూపొందించారు.
"చాలా మంది పిల్లల్లో వైరస్ లక్షణాలు కనిపించవు. ఒకవేళ కనిపించినా అవి స్పల్పంగానే ఉంటాయి. ఎక్కువ మంది జ్వరం, శ్వాస సమస్య, విరేచనాలు, వాంతులు, కడుపునొప్పి వంటి ఇబ్బందులు ఎదుర్కొనవచ్చు. వయసు పెరిగే కొద్దీ వైరస్ లక్షణాలు స్పష్టంగా కనిపిస్తుంటాయి" అని ఆ నివేదికలో పేర్కొన్నారు.
సౌకర్యాలు పెంచాలి..
చిన్న పిల్లల కోసం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుంచి అన్ని స్థాయిల్లో తగినంత స్థాయిలో మౌళిక సౌకర్యాలు కల్పించాలని నిపుణుల బృందం సిఫార్సు చేసింది, ఆక్సిజన్, మందులు, ఇతర పరికరాలతో పాటు శిక్షణ పొందిన సిబ్బందిని సిద్ధంగా ఉంచాలని సూచించింది. టీకాలు, పౌష్టికాహారంపై దృష్టి పెట్టాలని, ఒకవేళ పాఠశాలలను ప్రారంభించేటట్టయితే తగిన విధంగా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.
సాధారణంగా పిల్లలపై వైరస్ ప్రభావం తక్కువ
* చిన్నపిల్లల్లో రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉంటుంది. పుట్టుకతోనే ఇవి అభివృద్ధి చెందుతాయి. వయస్సు పెరిగే కొద్దీ పిల్లల్లో రోగ నిరోధక శక్తి తగ్గుతుంది. అందువల్ల, చిన్నపిల్లలకు వైరస్ సంక్రమణ ప్రమాదం చాలా తక్కువ. ఒకవేళ, కరోనా సోకినప్పటికీ, వారు మరణించేంత ప్రమాదం ఉండదు.
కరోనా సంక్రమణకు అడ్డుగా నిలిచే దీనిని కణాలను యాంటీబాడీ డిపెండెంట్ ఎన్‌హాన్స్‌మెంట్ (ADE) అని పిలుస్తారు. కరోనా సోకిన పిల్లల కంటే పెద్దల్లో ఈ ADE కణాలు తక్కువగా ఉంటాయి. అందువల్ల, పెద్లలకే కరోనా సంక్రమణ ప్రమాదం ఎక్కువగా ఉంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.
* చిన్న పిల్లలకు 5 ఏళ్ల వరకు పోలియో చుక్కలు వేస్తుంటారు. ఆ తర్వాత కూడా 12ఏళ్ల వరకు వివిధ రకాల ఇంజెక్షన్లు వేయాల్సి ఉంటుంది. తద్వారా వారి శరీరంలో యాంటీబాడీలు పెంపొందుతాయి. ఫలితంగా వారి శరీరంలోకి వైరస్ చొరబడే అవకాశాలు చాలా తక్కువ.
* పెద్దలతో పోలిస్తే పిల్లలు చాలా తక్కువగా ఇంటి నుంచి బయటికి వెళ్తుంటారు. ప్రయాణాలు కూడా తక్కువగా చేస్తుంటారు. అందుకే, వారికి వైరస్ సోకే అవకాశాలు కూడా తక్కువగానే ఉంటాయి.
* వృద్ధాప్యం రోగనిరోధక శక్తితో సంబంధం కలిగి ఉంటుంది. వయసు పెరిగేకొద్ది రోగనిరోధక శక్తి క్రమంగా క్షీణిస్తుంది. తద్వారా, వైరస్ సులభంగా శరీరంలోకి ప్రవేశిస్తుంది. అదే పిల్లల విషయానికి వస్తే.. వారిలో బలమైన రోగనిరోధక శక్తి ఉంటుంది. ఫలితంగా వారికి వైరస్ సోకే ప్రమాదం తక్కువగా ఉంటుంది.
* పిల్లల్లో మధుమేహం, రక్తపోటు, గుండె జబ్బులు, సిఓపిడి వంటి వ్యాధులు సోకే అవకాశాలు చాలా అరుదు. అదే పెద్దవారిలో అయితే, ఈ వ్యాధులు సోకే అవకాశాలు ఎక్కువ.
పిల్లలను వైరస్ సంక్రమణ నుండి ఎలా కాపాడుకోవాలి?
కరోనా నుంచి మనల్ని మనం ఎలాగ రక్షించుకుంటున్నామో చిన్న పిల్లలకు కూడా అవే జాగ్రత్తలు పాటించేలా చూసుకోవాలి. సామాజిక దూరం పాటించడం, ముక్కు, నోటిని పూర్తిగా కప్పి ఉంచేలా ముసుగు ధరించడం, చేతులను శానిటైజ్ చేసుకోవడం, రద్దీ ప్రదేశాలకు వెళ్లకపోవడం వంటి జాగ్రత్తలు చెప్పాలి. ఎక్కువ మంది యువత, వృద్ధులు టీకాలు వేసుకోవడం ద్వారా వారి నుంచి పిల్లలకు వైరస్ సంక్రమించే ప్రమాదాన్ని కూడా తగ్గించవచ్చు.
పిల్లలకు కరోనా రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు:
1. సాధ్యమైనంత వరకు పిల్లలు ఇంట్లోనే ఉండేలా చూసుకోవాలి.
2. బంధువులు / స్నేహితుల ఇళ్లకు పంపించడం మంచిది కాదు.
3. పిల్లలను ఎక్కువగా రద్దీ ప్రదేశాలకు, సమావేశాలకు తీసుకెళ్లవద్దు.
4. పిల్లల చేత రోజుకు 2 సార్లు స్నానం చేయించాలి.
5. క్రమం తప్పకుండా కనీసం 20 సెకండ్ల పాటూ చేతులు శుభ్రపరచుకోవడం అలవాటు చేయాలి.
6. చేతులు శుభ్రం చేసుకోకుండా కళ్ళు, ముక్కును తాకడం, రుద్దడం చేయవద్దని చెప్పాలి.
7. పిల్లలు తమను తాము శుభ్రపరచుకోకుండా ఏ వస్తువును తాకవద్దని పిల్లలకు చెప్పాలి.
8. పిల్లలు తరుచుగా వాడే ఆట వస్తువులు మరియు సెల్‌ఫోన్‌లు, జాయ్ స్టిక్స్, కంప్యూటర్లు, కీబోర్డులు మొదలైన వాటిని ఎప్పటికప్పుడు శుభ్రపరుస్తూ ఉండాలి.
9. పిల్లలను ఉదయం పూట సూర్యకాంతిలో కూర్చోవడం అలవాటు చేయాలి. కనీసం రోజుకు గంట చొప్పున ఆడుకోవటానికి అనుమతించాలి.
10. మన ఇంట్లోని మరుగుదొడ్లను ప్రతిరోజూ క్రిమిసంహారక మందులతో శుభ్రం చేసుకోవాలి.
11. మనం వాడే దిండ్లు, పిల్లో కవర్లు తరచూ శుభ్రం చేయాలి.
12. గోరు వెచ్చని నీటిని తాగడం అలవాటు చేయాలి. పుక్కలించేటప్పుడు కూడా వెచ్చని నీరు ఇవ్వండి.
13. భౌతిక దూరం, మాస్కు ధరించడం, సబ్బు లేదా శానిటైజర్ ను అలవాటు చేయడంతోపాటు పాటించేలా చూడాలి.