ఆర్కేనగర్ ఉప ఎన్నిక ఫలితాలు.. చిన్నమ్మ హర్షం.. ప్రభుత్వం కూలిపోతుందా?

సోమవారం, 25 డిశెంబరు 2017 (12:43 IST)
తమిళనాట ఆర్కేనగర్‌ ఉప ఎన్నిక ఫలితాలు రాజకీయంగా వేడి పుట్టిస్తున్నాయి. దివంగత జయలలిత నియోజకవర్గమైన ఆర్కే నగర్‌లో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన టీటీవీ దినకరన్‌ 40వేలకుపైగా మెజారిటీ ఘనవిజయాన్ని కైవసం చేసుకున్న నేపథ్యంలో.. దినకరన్ విజయంపై జైలులో వున్న చిన్నమ్మ శశికళ హర్షం వ్యక్తం చేశారు.
 
ఆర్కే నగర్ ఉప ఎన్నికలో ఇండిపెండెంట్‌గా పోటీ చేసిన శశికళ మేనల్లుడు దినకరన్ సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో  అధికారంలో ఉన్నప్పటికీ అటు అన్నాడీఎంకేగానీ, ఇటు ప్రధాన ప్రతిపక్షం డీఎంకేగానీ దినకరన్‌కు గట్టిపోటీ ఇవ్వలేకపోయాయి. ఈ నేపథ్యంలో అగ్రహార జైలులో శిక్ష అనుభవిస్తున్న శశికళ జైలు అధికారుల ద్వారా దినకరన్‌కు శుభాకాంక్షలు తెలిపారు. 
 
కోట్లాది మంది కార్యకర్తలు దినకరన్ వెంట ఉన్నారని, ఆయనకు సహాయ సహకారాలు అందిచారని చిన్నమ్మ వెల్లడించారు. అమ్మ జయలలిత రెండుసార్లు ఎమ్మెల్యేగా వ్యవహరించిన ఆర్కే నగర్ అభివృద్ధికి దినకరన్ కృషి చేయాలని తన శుభాకాంక్షల లేఖలో చిన్నమ్మ తెలిపారు. ఇదిలా ఉంటే.. ఆర్కే నగర్ విజయంతో సంబరాలు చేసుకుంటున్న శశికళ వర్గం కార్యకర్తలు.. అన్నాడీఎంకే అధ్యక్షుడు దినకరనే అంటూ నినాదాలు చేస్తూ హంగామా సృష్టించారు. అటు దినకరన్‌ కూడా అన్నాడీఎంకే సర్కారు మూడు నెలల్లో కూలిపోతుందంటూ జోస్యం చెప్పారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు