మహిళలపై భూమిపైనే కాదు.. నింగిలోనూ భద్రత లేకుండా పోయింది. విమానంలో కిటికీ పక్క సీట్లో కూర్చొన్న మహిళా ప్రయాణికురాలికి.. వెనుక సీట్లో కూర్చొన్న ఇద్దరు ప్రయాణికులు తాకరాని చోట తాకారు. దీంతో ఆ మహిళా ప్యాసింజర్ విమాన సిబ్బందికి ఫిర్యాదు చేయడంతో జైలు ఊచలు లెక్కిస్తున్నారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ సంఘటన వివరాలను పరిశీలిస్తే...
ఇటీవల ఢిల్లీ నుంచి ముంబైకు ఇండిగో 6ఈ 843 రకం విమానం కొంతమంది ప్రయాణికులతో బయలుదేరింది. ఈ మహిళ విమానంలో కిటికీ పక్క సీటులో కూర్చుంది. ఆమె వెనుక సీట్లలో కూర్చున్న మాలేగామ్, నాసిక్ పట్టణాలకు మోమిన్ అర్షద్ హుసేన్, ఫైజాన్ అంజూమ్ మహమ్మద్ ఫారూఖ్ అనే ఇద్దరు ప్రయాణికులు.. ముందు సీట్లో ఉన్న మహిళా ప్రయాణికురాలిని తాకరాని చోట తాకుతూ అసభ్యంగా ప్రవర్తిస్తూ లైంగికంగా వేధించారు.
దీంతో ఆ మహిళా విమాన సిబ్బందికి ఫిర్యాదు చేయగా, క్రూ సిబ్బంది విమానాశ్రయ అధికారులకు సమాచారం అందించారు. విమానం ముంబైలో ల్యాండ్ కాగానే సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్సు సిబ్బంది వచ్చి ఇద్దరు నిందితులను అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెట్టారు. నిందితులపై ఐపీసీ సెక్షన్ 354, 34ల కింద కేసు నమోదు చేశారు.