జూలై 22 నుంచి బడ్జెట్ సమావేశాలు... 23న బడ్జెట్ దాఖలు

సెల్వి

శనివారం, 6 జులై 2024 (17:15 IST)
కేంద్రంలో భారతీయ జనతా పార్టీ సారథ్యంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. ఈ కొత్త ప్రభుత్వ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 22వ తేదీ నుంచి ప్రారంభంకానున్నాయి. ఈ సమావేశాల్లో భాగంగా 23వ తేదీన కేంద్ర వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికిగానూ ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ సభలో వార్షిక బడ్జెట‌్‌ను సమర్పిస్తారు. ఈ విషయాన్ని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్‌ రిజిజు తన ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. జూలై 22 నుంచి ఆగస్టు 12వ తేదీ వరకు బడ్జెట్ సమావేశాలు జరుగుతాయని ఆయన పేర్కొన్నారు. 
 
కాగా, ఎన్నికల సంవత్సరం కావడంతో ఈ యేడాది ఫిబ్రవరి 1న నిర్మలమ్మ ఓటాన్‌ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఏర్పడటంతో పూర్తి స్థాయి బడ్జెట్‌ను తీసుకొస్తున్నారు. మోడీ 3.0లో ప్రవేశపెట్టనున్న తొలి బడ్జెట్‌ ఇదే. దీంతో వరసగా ఏడుసార్లు బడ్జెట్‌ సమర్పించిన ఘనతను నిర్మలా సీతారామన్‌ అందుకోనున్నారు. ఇప్పటివరకు మొరార్జీ దేశాయ్‌ వరసగా ఆరుసార్లు బడ్జెట్‌ సమర్పించారు.
 
2019లో రెండోసారి మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత సీతారామన్‌కు ఆర్థిక శాఖ బాధ్యతలు అప్పగించారు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ తర్వాత బడ్జెట్‌ ప్రవేశపెట్టిన రెండో మహిళగా గుర్తింపు పొందారు. ఎప్పటిలా సూట్‌కేసులో కాకుండా రాజముద్ర ఉన్న ఎరుపు రంగు వస్త్రంలో బడ్జెట్‌ ప్రతులను తీసుకొచ్చే కొత్త సంప్రదాయానికి శ్రీకారం చుట్టారు. ఈ బడ్జెట్ రూపకల్పన పనులు ఇప్పటికే జోరుగా సాగుతున్న విషయం తెల్సిందే. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు