లోక్‌సభలో గురువారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన 2024-25 వార్షిక మధ్యంతర బడ్జెట్‌లో పన్ను విధానాల్లో ఎలాంటి మార్పులు చేయలేదు. ఆదాయపు పన్ను కొత్త విధానంలో వారికి రూ.7 లక్షల వరకు ఎటువంటి పన్ను ఉండదని పునరుద్ఘాటించారు. ఇది 2013-14లో రూ.2.2 లక్షలుగా ఉందని గుర్తు చేశారు. కార్పొరేట్ పన్నును దేశీయ కంపెనీలకు 30 శాతం నుంచి 22 శాతానికి.. కొన్ని రకాల తయారీ రంగ సంస్థలకు 15 శాతానికి తగ్గించినట్లు వెల్లడించారు. ప్రజల సగటు వాస్తవిక ఆదాయం 50శాతం పెరిగినట్లు చెప్పారు.
ప్రత్యక్ష పన్నులకు సంబంధించి వివాదాస్పద డిమాండ్ నోటీసులు అందుకొన్న వారికి ఊరటనిచ్చారు. 2009-10 మధ్య రూ.25 వేల వరకు విలువైన డిమాండ్ నోటీసులను ఉపసంహరించుకొన్నారు. 2010-11 నుంచి 2014-15 ఆర్థిక సంవత్సరాల మధ్య రూ.10వేల వరకు చెల్లించాలని జారీ అయిన నోటీసులను రద్దు చేశారు.
దీంతో దాదాపు కోటి మంది లబ్ధి పొందనున్నట్లు ఆమె తెలిపారు. వ్యాపారాలను సరళతరం చేయడానికి ఈ నిర్ణయం తీసుకొన్నట్లు పేర్కొన్నారు. ఈక్రమంలో చిన్న మొత్తంలో ఉన్న ప్రత్యక్షపన్ను వివాదాస్పద డిమాండ్ల (నోటీసులు)ను రద్దు చేసుకొంటున్నట్లు వివరించారు.
ఆదాయపు పన్ను రిఫండ్ సమయాన్ని తమ ప్రభుత్వం గణనీయంగా తగ్గించిందని ఆర్థిక మంత్రి వెల్లడించారు. 2013-14లో ఇది సగటున 93 రోజులు ఉండగా.. ప్రస్తుతం దానిని 10 రోజలకు తీసుకురాగలిగామని వెల్లడించారు.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2024-25 ఆర్థిక సంవత్సరానికిగాను మధ్యంతర బడ్జెట్‌ను లోక్‌సభలో గురువారం ప్రవేశపెడుతున్నారు. మరో రెండు నెలల్లో సార్వత్రిక ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఈ మధ్యతర బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నారు. సార్వత్రిక ఎన్నికల తర్వాత పూర్తి స్థాయి బడ్జెట్‌ను సభలో ఆమె ప్రవేశపెడుతారు. కాగా, ఆమె ప్రసంగంలోని ముఖ్యాంశాలను పరిశీలిస్తే,
పేదరిక నిర్మూలనకు బహుముఖీయ విధానాలతో ప్రభుత్వం పనిచేసింది.
ప్రధాని మోడీ నాయకత్వంలోని ప్రభుత్వం నాలుగు వర్గాలకు ప్రాధాన్యమిచ్చింది.
పేదలు, మహిళలు, యువత, అన్నదాతలను శక్తిమంతం చేసింది.
పేదలకు జన్‌ధన్ ఖాతాల ద్వారా రూ.34 లక్షల కోట్లు అందించాం.
78 లక్షల మంది వీధి వ్యాపారులకు ఆర్థిక సాయం అందించాం.
రూ.2.20 లక్షల కోట్ల పూచీకత్తులేని రుణాలు అందించాం.
11.8 కోట్ల మంది రైతులకు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా ఆర్థిక సాయం అందించాం.
4.50 కోట్ల మందికి బీమా సౌకర్యం కల్పించాం.
వ్యవసాయ రంగంలో కొత్త సాంకేతికతతో విలువ జోడించే విధానాలు తెచ్చాం.
స్కిల్ ఇండియా మిషన్‌తో కోటి 40 లక్షల మంది యువతకు నైపుణ్య శిక్షణ అందించాం.
యువతకు ముద్రా యోజనతో రూ.25 లక్షల కోట్లు రుణాలుగా ఇచ్చాం.
కొత్తగా 3000 ఐటీఐలు, 7 ఐఐటీలు, 16 ఐఐఐటీలు, 7 ఐఐఎంలు ప్రారంభించాం.
నూతన సంస్కరణలతో కొత్త పారిశ్రామిక వేత్తలు పుట్టుకొచ్చారు.
సంస్కరణపథంలో ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందుతోంది.
ఆత్మనిర్భర భారత్ నిర్మాణంలో ప్రతి వ్యక్తి భాగస్వాములయ్యారు.