జీవితాన్ని రీసెట్ చేసిన కరోనా వైరస్ : ఉపరాష్ట్రపతి వెంకయ్య

ఆదివారం, 12 జులై 2020 (15:38 IST)
కరోనా వైరస్ ప్రతి ఒక్కరి జీవితాన్ని రీసెట్ చేసిందని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అభిప్రాయపడ్డారు. పాజ్ బటన్ నొక్కినట్టుగా జీవితాన్ని ఆపేసిందని, రీసెట్ బటన్ ద్వారా పునఃప్రారంభాన్ని కూడా చూపించిందని పేర్కొన్నారు. సరిగ్గా చెప్పాలంటే రెండు జీవన విధానాల మధ్య ఇదొక సంధి కాలం అని అభివర్ణించారు. 
 
దేశాన్ని కరోనా వైరస్ మహమ్మారి కమ్మేసిన పరిస్థితులపై వెంకయ్య నాయుడు తాత్విక రీతిలో స్పందించారు. మానవుడి ఆధునిక జీవితం ఎంతో సాఫీగా దూసుకెళుతోంది అని భ్రమపడుతున్న వేళ... జీవితంలోకి కనిపించకుండా కరోనా వైరస్ వచ్చిందని తెలిపారు.
 
మానవ జీవితం ఒక్కసారిగా నిలిచిపోయిందని, కరోనా సమయంలో ఏం నేర్చుకున్నామన్నదానిపై భవిష్యత్ పునాదులు లేస్తాయన్నారు. "ఆంగ్లంలో ఓ సామెత ఉంది. బి (బర్త్) నుంచి డి (డెత్) వరకు సాగేదే జీవితం. మధ్యలో సి (చాయిస్‌లు) జీవితం తీరుతెన్నులను నిర్ణయిస్తుంది. 
 
ప్రముఖ తత్వవేత్త సొక్రటీస్ ఏంచెప్పాడో చూడండి... సవాళ్లు ఎదుర్కోని జీవితం నిజమైన జీవితమే కాదన్నాడు. ఎలా జీవిస్తున్నామన్నదానిపై ఇప్పటివరకు సమీక్షించుకునే అవకాశం మనకు రాలేదు. కానీ కరోనా రూపంలో ఆ అవకాశం మన ముంగిట నిలిచింది. ఇప్పటికైనా జీవితాన్ని బేరీజు వేసుకుంటూ ముందుకు సాగాల్సిన అవసరాన్ని కరోనా చాటిచెబుతోంది" అంటూ వివరించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు