పురోహితుడు - ఫోటోగ్రాఫర్ మరో 14 మందితో వివాహం.. ఎక్కడ?

మంగళవారం, 28 ఏప్రియల్ 2020 (10:37 IST)
కరోనా వైరస్ దెబ్బకు అంగరంగ వైభవంగా జరగాల్సిన వివాహాలు కేవలం చేతి వేళ్ళపై లెక్కించే సంఖ్యలో ఉన్న అతిథుల సమక్షంలోనే జరిపించేస్తున్నారు. ఇటీవల కర్నాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్.డి. కుమారస్వామి తనయుడు నిఖిల్ కుమారస్వామి గౌడ వివాహం కూడా కేవలం ఇరు కుటుంబాలకు చెందిన సభ్యులు, అతికొద్దిమంది ప్రముఖుల సమక్షంలో జరిగింది. 
 
ఇపుడు తమిళనాడులో కూడా అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే కుమార్తె వివాహం కూడా ఇదేవిధంగా కేవలం 14 మందితో జరిపించేశారు. ఈ 14 మందిలో ఒకరు పురోహితుడు అయితే మరొకరు ఫోటోగ్రాఫర్. ఈ వివాహం తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి కె. పళనిస్వామి సొంత నియోజకవర్గంలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, సేలం జిల్లా ఏర్కాడు ఎమ్మెల్యే చిత్ర - గుణశేఖర్ దంపతుల కుమార్తె సింధు (21) అనే యువతికి ధర్మపురి జిల్లా పాపిరెట్టిపట్టికి చెందిన విద్యుత్ బోర్డు ఇంజినీర్ ప్రశాంత్‌ల వివాహం ఇటీవలే నిశ్చయమైంది. 
 
ఈ నెల 26వ తేదీన ముఖ్యమంత్రి పళనిస్వామి నియోజకవర్గమైన ఎడప్పాడిలోని తాంతోంద్రీశ్వర్ ఆలయంలో వివాహం జరగుతుందని, ఈ వివాహ మహోత్సవ కార్యక్రమానికి ముఖ్యమంత్రి ఎడప్పాడి కె.పళనిస్వామితో పాటు.. ఉప ముఖ్యమంత్రి ఓ పన్నీర్ సెల్వం, ఇతర మంత్రులు హాజరువుతారని శుభలేఖలో పేర్కొన్నారు.
 
అయితే కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్ అమలు చేస్తున్నాయి. ఈ లాక్‌డౌన్ కారణంగా ముందుగా నిర్ణయించిన ముహూర్తానికే ఆలయంలో సాదాసీదాగా వివాహాన్ని జరిపించేశారు. ఈ వివాహ కార్యక్రమానికి పురోహితుడు, ఫొటోగ్రాఫర్ సహా 14 మంది మాత్రమే హాజరయ్యారు. 
 
అయితే, ఈ వివాహంపై విపక్ష డీఎంకే తీవ్ర విమర్శలు గుప్పించింది. లాక్‌డౌన్ ఆంక్షలు అమల్లో ఉన్న సమయంలో నిబంధనలు ఉల్లంఘించి వివాహం జరిపించారని ఆరోపించారు. పైగా, దీనిపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. అయితే, ఎమ్మెల్యే చిత్ర గుణశేఖర్ మాత్రం డీఎంకే ఆరోపణలు కొట్టిపారేస్తూ, ఈ వివాహం ఆలయం వెలుపల జరిగిందని వివరణ ఇచ్చారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు