ఈ వ్యవహారంపై మౌనంగా ఉంటూ వచ్చిన రజినీకాంత్ ఎట్టకేలకు బుధవారం స్పందించారు. భారత్‌ను ఏకం చేయగల సత్తా హిందీకే ఉందన్న షా వ్యాఖ్యలతో ఆయన విభేదించారు. హిందీని జాతీయ భాషగా చేయాలన్న అమిత్ షా వ్యాఖ్యలను ఎవరూ ఆమోదించబోరని స్పష్టం చేశారు. దక్షిణ భారత దేశంలో ముఖ్యంగా తమిళనాడులో హిందీని బలవంతంగా రుద్దితే అంగీకరించే ప్రసక్తే లేదని ఆయన తేల్చిచెప్పారు.
కేంద్రం తమపై హిందీని బలవంతంగా రుద్దేందుకు ప్రయత్నిస్తోందంటూ తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి రాష్ట్రాలతో పాటు.. బీజేపీ పాలిత రాష్ట్రమైన కర్నాటకకు చెందిన బీజేపీ నేతలు సైతం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమిత్ షా ప్రకటన తమ మాతృభాషను అమితంగా ప్రేమించే హిందీయేతర ప్రాంతాల ప్రజలపై దండయాత్ర ప్రకటించడమేనని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ వ్యాఖ్యానించారు.
పైగా, అమిత్ షా వ్యాఖ్యలపై దక్షిణాది రాష్ట్రాల్లో తీవ్ర వ్యతిరేకత, విమర్శలు వచ్చాయి. స్టాలిన్, కమల్ హాసన్, మమతా బెనర్జీ వంటి పలువురు నేతలు కూడా షా వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇపుడు వీరితో రజినీకాంత్ కూడా జతకలిశారు.