డాలర్ మారక రూపాయి విలువ గురువారం మార్కెట్లో రికార్డుస్థాయిలో డాలరుకు రూ.50.50ల మేరకు పతనమైంది. ఆసియా స్టాక్ మార్కెట్లలో షేర్ల పతనం కొనసాగుతుండంతో కలవరపడిన విదేశీ మదుపు సంస్థలు స్థానిక కరెన్సీలను పెద్ద ఎత్తున నగదుగా మార్చుకోవడానికి ప్రయత్నించడంతో ఆసియా కరెన్సీలు పూర్తిగా దెబ్బతిన్నాయి.
గురువారం ఉదయం 9 గంటలకు మార్కెట్లో డాలర్ మారక రూపాయి డాలర్‌కు 50.4547కి దిగజారిపోయింది. అక్టోబర్ నెల చివరిలో డాలర్ మారక రూపాయి రూ.50.29 లకు రికార్డు స్థాయి పతనం చవి చూసింది. బుధవారం రూపాయి విలువ డాలర్‌తో పోలిస్తే రూ.50.0203లకు పడిపోయింది.
అక్టోబర్ 27న మదుపరుల్లో భయాందోళనలు కల్గిస్తూ డాలర్ మారక రూపాయి రేటు రూ.50లకు పతనమైనప్పటికీ తర్వాత కోలుకుని మార్కెట్ ముగిసేసరికి రూ.49.05ల వద్ద నిలబడింది. ఈ సంవత్సరం జనవరిలో డాలర్‌కి రూ.39.42లుగా ఉన్న రూపాయి విలువ సంవత్సరాంతానికి 27 శాతం విలువను కోల్పోయి డాలర్‌కు రూ.50లకు పతనం కావడం గమనార్హం.
రూపాయి పతనం 2008 సెప్టెంబర్ నుంచి భారీగా క్షీణించడం మొదలెట్టిందని ఆర్బీఐ డేటా చెబుతోంది. అమెరికా, యూరప్‌లలో ఆర్థిక సంక్షోభం తారాస్థాయికి చేరడంతో గత రెండునెలల కాలంలో భారతీయ రూపాయి తన విలువలో 11 శాతం మేరకు కోల్పోయి డాలరుతో పోలిస్తే 45 నుండి 50 రూపాయలకు దిగజారిపోయిందని ఆర్బీఐ పేర్కొంది.