దేశంలో 70 కోట్లను దాటిన మొబైల్ ఫోన్ యూజర్ల సంఖ్య

మంగళవారం, 28 డిశెంబరు 2010 (15:05 IST)
అక్టోబర్‌ నెలాఖరు నాటికి భారత్‌లో మొబైల్‌ వినియోగదారుల సంఖ్య 70 కోట్లను దాటినట్లు ట్రాయ్ విడుదల చేసిన గణాంకాలు వెల్లడిస్తున్నాయి. కాగా.. ఒక్క అక్టోబర్‌ నెలలోనే కొత్తగా 1.89 కోట్ల మంది మొబైల్ వినియోగదారులు కొత్తగా కనెక్షన్లు తీసుకున్నారని టెలికాం నియంత్రణ సంస్థ (ట్రాయ్‌) ప్రకటించింది.

అంతకుముందు నెల (సెప్టెంబర్‌)తో పోలిస్తే ఫోన్‌ యూజర్‌ బేస్‌ 2.76 శాతం పెరిగిందని ట్రాయ్ తెలిపింది. అక్టోబర్‌ చివరికి దేశంలో వైర్‌లెస్‌, వైర్‌లైన్‌ కనెక్షన్ల సంఖ్య 74.21 కోట్లు ఉండగా.. ఒక్క వైర్‌లెస్ (మొబైల్ ఫోన్) చందాదారుల సంఖ్య 70.66 కోట్లుగా ఉంది. దీంతో దేశంలో మొత్తం టెలీ సాంద్రత (టెలీ డెన్సిటీ) 62.5 శాతానికి పెరిగిందని ట్రాయ్ పేర్కొంది.

ప్రముఖ ప్రైవేటు రంగ టెలికాం సంస్థ భారతీ ఎయిర్‌టెల్‌ 14.6 కోట్ల చందాదారులతో అగ్రస్థానంలో ఉండగా.. వొడాఫోన్ 11.8 కోట్ల చందాదారులతో ద్వితీయ స్థానంలో ఉంది. కాగా.. బ్రాడ్‌బ్యాండ్‌ వినియోగదారుల సంఖ్య 2.24 శాతం పెరిగి 1.02 కోట్లకు చేరుకోగా... వైర్‌లైన్‌ వినియోగదారుల సంఖ్య మాత్రం మరింత తగ్గి 3.54 కోట్లకు పడిపోయింది.

వెబ్దునియా పై చదవండి