ఎయిర్ ఇండియాకు రూ.1200 కోట్ల ఈక్విటీ నిధులు: ప్రఫుల్

శుక్రవారం, 31 డిశెంబరు 2010 (10:39 IST)
నష్టాల ఊబిలో ఉన్న ఎయిర్ ఇండియా సంస్థను ఆదుకునేందుకు కేంద్రం సంసిద్ధత వ్యక్తం చేసింది. ఇందులోభాగంగా ఈ సంస్థకు 1200 కోట్ల రూపాయల ఈక్విటీ నిధులను సమకూర్చనుంది. ఈ విషయాన్ని కేంద్ర పౌర విమానయాన శాఖామంత్రి ప్రఫుల్ పటేల్ ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశం అనంతరం వెల్లడించారు.

ఈ సొమ్ముతో ఎయిరిండియా సంస్థాగత పునర్నిర్మాణంతో పాటు ఆర్థిక వనరులు కూడా పెరుగుతాయని ఆయన అన్నారు. అంతేకాకుండా, ఎయిర్ ఇండియాలో 25 వేల మంది ఉద్యోగుల వేతనాలను హేతుబద్ధం చేయాలన్న షరతును కూడా విధించింది.

ఇదిలావుండగా, ఎయిర్ ఇండియాకు ఈ యేడాదిలో కేంద్రం నిధులు సమకూర్చడం ఇది రెండోసారి కావడం గమనార్హం. గతంలో ఫిబ్రవరిలో పునరుజ్జీవ ప్రణాళిక కింద 800 కోట్లు అందజేసింది. సంస్థ పనితీరు ప్రాతిపదికన దశలవారీగా ఎయిరిండియాకు ప్రభుత్వం ఈక్విటీని అందిస్తున్నదని సంస్థ వర్గాలు తెలిపాయి.

దీంతో పాటు ఖర్చు తగ్గింపులో భాగంగా 25 వేల మంది ఉద్యోగుల వేతనాలను హేతుబద్ధం చేయాలని నిర్ణయించగా, దీనికి ఉద్యోగ సంఘాల యూనియన్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. అలాగే, బకాయిల చెల్లింపును కూడా మరో మూడేళ్ళ పాటు వాయిదా వేయాలని కేంద్రం భావిస్తోంది.

వెబ్దునియా పై చదవండి