తగ్గిన ఆహార ద్రవ్యోల్బణం.. అయినా తగ్గని కూరగాయల ధరలు!!
ఆహార ద్రవ్యోల్బణం తగ్గింది. ఈనెల ఒకటో తేదీతో ముగిసిన వారాంతానికి ఆహార ద్రవ్యోల్బణం కొంతమేరకు తగ్గి 16.91 శాతం వద్ద ఆగింది. అంతకుముందు వారంతో పోల్చుకుంటే ఇది 18.32 శాతంగా ఉంది. అయితే, ద్రవ్యోల్బణం తగ్గినప్పటికీ మండుతున్న కూరగాయలు, ఉల్లిపాయలు, ఇతర ఆహార వస్తువుల ధరల్లో మాత్రం ఏమాత్రం తేడా కనిపించడం లేదు.
ద్రవ్యోల్బణం 1.41 శాతం మేరకు తగ్గినప్పటికీ కూరగాయల ధరలు మాత్రం వార్షిక ప్రాతిపదికన పరిశీలిస్తే 70.73 శాతం మేర పెరుగుదల నమోదు చేసుకున్నట్టు ప్రభుత్వం విడుదల చేసిన అధికారిక ప్రకటనలో పేర్కొంది. ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపడుతున్నప్పటికీ.. ఉల్లిపాయల ధరలు మాత్రం కిందికి దిగిరావడం లేదు.
ఫలితంగా ఉల్లి ధరతో పాటు గుడ్డు, మాంసం వంటి ఆహార వస్తువులు 16.70 శాతం మేర పెరిగాయి. పాల ధర 13.20 శాతం, పండ్ల ధర 17.71 శాతం మేర పెరుగుదలను నమోదు చేసుకున్నట్టు ఆ ప్రకటన తెలిపింది. అయితే పప్పుధాన్యాలు 14.84, గోధుమలు 4.87, బంగాళాదుంపలు 1.67, తృణధాన్యాలు 0.12 శాతం వంతున తగ్గాయి.