మెగాస్టార్ చిరంజీవి రాజకీయాల్లోకి దిగకూడదని పలు రాజకీయాలు చేసిన కొందరిని ఖంగుతినిపించేలా చిరంజీవి పావులు కదుపుతున్నారు. సోమవారం రాత్రి తనకు అత్యంత సన్నిహితులైన ముగ్గురు మీడియా అధినేతలను ఆయన కలుసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. గత కొన్ని రోజులుగా ఆయన కుటుంబంలో జరిగిన సంఘటనలను వారితో చర్చించినట్లు సమాచారం. శ్రేయోభిలాషులు,మేథావులతో కూడా చర్చించిన మీదట తన రాజకీయ ప్రవేశాన్ని బయటపెట్టినట్లు తెలిసింది.
ఇప్పటివరకూ చిరంజీవి రాజకీయాల్లోకి రారనీ, ఆయనకు వచ్చే ధైర్యం కూడా లేదని చెప్పుకుంటున్న కొంతమందికి ఈ విషయం షాక్ లాంటిది. వచ్చే ఏడాది సంక్రాంతి నాటికి పార్టీని ప్రకటించే అవకాశాలున్నాయని విశ్వసనీయ సమాచారం. ఇప్పటికే కాపు సంఘాలు, సిపీఐ, తెరాస, సి.పి.ఎం తదితర పార్టీలు చిరంజీవి రాజకీయాల్లోకి వస్తే స్వాగతిస్తామని ప్రకటించాయి.
వీరందరినీ కలుపుకుని పార్టీగా ఎదగాలనీ, బలహీన వర్గాలను, దళితులను సంఘటితం చేసే శక్తి చిరంజీవికి ఉందని ఆయన సన్నిహితులలో ఒకరైన ప్రసాద్ రెడ్డి వ్యాఖ్యానించినట్లు సమాచారం. మరోవైపు ముఖ్యమంత్రి వైఎస్... చిరు రాజకీయ ప్రవేశం విషయమై స్పందిస్తూ... చిరంజీవి రాజకీయాల్లోకి రావటాన్ని స్వాగతిస్తామన్నారు. అలాగే కాంగ్రెస్ తన పూర్వ వైభవాన్ని ఎప్పటిలానే కొనసాగిస్తుందని తెలిపారు.