ప్రజలారా.. వైఎస్ కోసం గాలించండి: రోశయ్య

రాష్ట్ర ప్రజలకు విత్తమంత్రి కొణిజేటి రోశయ్య ఓ విజ్ఞప్తి చేశారు. నల్లమల అటవీ ప్రాంతంలో ఆచూకీ తెలియని ముఖ్యమంత్రి, ఆయన ప్రయాణించే హెలికాఫ్టర్‌‍ ఆచూకీ తెలుసుకునేందుకు స్థానిక ప్రజలు గాలింపు చర్యలు చేపట్టాలని ఆయన పిలుపునిచ్చారు. అంటే.. ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డి ఆచూకీ తెలియలేదనే విషయం తేటతెల్లమైంది.

చిత్తూరు జిల్లాలో ఒక అధికారిక పర్యటనలో పాల్గొనేందుకు ఆయన బుధవారం ఉదయం 8.35 నిమిషాలకు హైదరాబాద్‌‍ బేగంపేట విమానాశ్రయం నుంచి వైఎస్ ప్రత్యేక హెలికాఫ్టర్‌లో బయలుదేరారు. ఆయన ప్రయాణించిన గంట సేపటి తర్వాత హెలికాఫ్టర్‌ నుంచి బేగంపేట ఎయిర్‌పోర్టు కంట్రోలింగ్ రూమ్‌కు సిగ్నల్స్ అందటం మానేశాయి.

సరిగ్గా ఉదయం 9.35 గంటల నుంచి ఆయన ఆచూకీ కనిపించడం లేదు. ముఖ్యమంత్రి ప్రయాణించే హెలికాఫ్టర్‌లో సీఎంతో పాటు.. చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్‌తో పాటు.. ఇద్దరు పైలట్లు ఉన్నారు. కాగా, సాయంత్రం నాలుగు గంటలకు ఆర్థిక మంత్రి రోశయ్య, ప్రధాన కార్యదర్శి రమాకాంత్ రెడ్డి, హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి, డీజీపీ ఎస్.ఎస్.పి.యాదవ్ మీడియాతో మాట్లాడారు.

దట్టమైన అటవీ ప్రాంతంలో స్థానిక ప్రజలే అడవిలోకి వెళ్లి గాలింపు చర్యలు చేపట్టాలని మంత్రి రోశయ్య పిలుపునిచ్చారు. వారికే ఆ ప్రాంతం గురించి పూర్తి అవగాహన ఉంటుందని, ఇతరులు ఏమాత్రం ఆ ప్రాంతంలోకి వెళ్లలేరని మంత్రి రోశయ్య స్పష్టం చేశారు.

వెబ్దునియా పై చదవండి