దేశం ఓ విశిష్ట నేతను కోల్పోయింది: మన్మోహన్

శుక్రవారం, 4 సెప్టెంబరు 2009 (17:03 IST)
ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డి అకాలమరణంతో తమ పార్టీతో పాటు.. దేశం ఒక విశిష్ట వ్యక్తిని కోల్పోయామని ప్రధాని మన్మోహన్ సింగ్ అభిప్రాయపడ్డారు. డాక్టర్ వై.ఎస్. రాజశేఖరరెడ్డి విషాదకర పరిస్థితులలో అకాల మృత్యువాత పడడంతో మన దేశం ఒక విశిష్ట నేతను, ఆంధ్ర ప్రదేశ్ ఒక ఆదర్శ ముఖ్యమంత్రిని కోల్పోయింది. పేదల సంక్షేమం కోసం ఆయన తపన చెందేవారని సందర్శకుల పుస్తకంలో తన సందేశంలో పేర్కొన్నారు.

ఆయన కుటుంబ సభ్యులకు, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను అని సీఎం క్యాంపు కార్యాలయంలో వైఎస్ భౌతికకాయానికి అంజలి ఘటించి, పిమ్మట సందర్శకుల పుస్తకంలో పైవిధంగా పేర్కొన్నారు. హెలికాఫ్టర్ దుర్ఘటనలో మృతి చెందిన డాక్టర్ రాజశేఖర్ రెడ్డికి శ్రద్ధాంజలి ఘటించడానికై డాక్టర్ మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధి, పలువురు పార్టీ నాయకులు శుక్రవారం ఉదయం రాజధానికి వచ్చిన విషయం తెల్సిందే.

అనంతరం కాంగ్రెస్ యువనేత రాహుల్ గాంధీ కూడా తన సందేశాన్ని లిఖించారు. డాక్టర్ వైఎస్సార్ అసలు సిసలైన నేతగా శ్లాఘించారు. 'ఆంధ్రప్రదేశ్, భారతదేశం పొందిన నష్టం ఇంతా అంతా కాదు. నేను స్వయంగా ముఖ్యమంత్రి నుంచి ఎంతో నేర్చుకున్నాను.

మన దేశంలోని పేద ప్రజల జీవితాలను మెరుగుపరచాలని ఆకాంక్షిస్తున్న వారందరికీ ఆయన స్ఫూర్తిదాత' అని రాహుల్ తన సంతాప సందేశంలో పేర్కొన్నారు. 'ఇది మన అందరికీ దుర్దినం. ఆయన కుటుంబానికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నట్టు రాహుల్ గాంధీ పేర్కొన్నారు.

వెబ్దునియా పై చదవండి