ప్రజారాజ్యం పార్టీ సీనియర్ నేత కేఎస్ఆర్ మూర్తి అధికార కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు నిర్ణయించుకున్నారు. ఇందులోభాగంగా ఆయన ఆదివారం ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు డి.శ్రీనివాస్‌తో సమావేశమయ్యారు. ఈ సమావేశానంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వచ్చే నెల ఒకటో తేదీన కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్టు ఆయన తెలిపారు.
సినీ హీరో చిరంజీవికి రాష్ట్రంలో మంచి ఇమేజ్ ఉన్నమాట వాస్తవమేనన్నారు. అయితే, ప్రజారాజ్యం పార్టీని శక్తివంతమైన రాజకీయ పార్టీగా తీర్చిదిద్దలేక పోయారన్నారు. ప్రరాపాకు తన లేఖను అధినేతకు ఫ్యాక్స్ ద్వారా పంపినట్టు తెలిపారు. ఎన్నికల కోసం నిధులు సేకరించినప్పటికీ ఖర్చు చేయలేదన్నారు.
అందువల్ల అనేక ప్రాంతాల్లో బీసీ అభ్యర్థులు పరాజయం పాలయ్యారని ఆరోపించారు. కేఎస్ఆర్ ఆరోపణలపై ప్రరాపా అధికార ప్రతినిధి గౌతమ్ తీవ్రంగా స్పందించారు. అధికార పార్టీలో చేరేందుకు చౌకబారు ఆరోపణలు చేస్తున్నారని దుయ్యబట్టారు. ఎన్నికల్లో ఎదురైన ఓటమికి సమిష్టి బాధ్యత తీసుకున్నామనే విషయం గుర్తుంచుకోవాలని ఆయన సూచించారు.