ముఖ్యమంత్రి రోశయ్య పితృసమానులు: మంత్రి సురేఖ

బుధవారం, 28 అక్టోబరు 2009 (11:13 IST)
ముఖ్యమంత్రి రోశయ్య తనకు పితృసమానులని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమాభివృద్ధి శాఖామంత్రి కొండా సురేఖ స్పష్టం చేశారు. ఆయనతో తనకు ఎలాంటి వ్యక్తిగత విభేదాలు లేవన్నారు. ఒక కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యురాలిగా పార్టీ అధిష్టానం ఆదేశాలకు అనుగుణంగా నడుచుకుంటానని స్పష్టం చేశారు.

దీనిపై ఆమె మాట్లాడుతూ.. తాను ముఖ్యమంత్రి రోశయ్యకు అనుకూలంగా మారినట్టు వస్తున్న భిన్నకథనాలు అర్థరహితమన్నారు. తన రాజకీయ గురువు తనయుడు వైఎస్.జగన్‌కు హాని కలుగుతుందని భావిస్తే తన పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు ఆమె ప్రకటించారు.

పదవులు శాశ్వతం కాదని, మానవ సంబంధాలు ముఖ్యమంత్రి ఆమె తేల్చి చెప్పారు. వైఎస్ మృతి అనంతరం తాను రాజీనామాకు సిద్ధపడితే ప్రభుత్వ సలహాదారు వైఎస్ ప్రాణ స్నేహితుడు కేవీపీ. రామచంద్రరావు వద్దని సలహా ఇచ్చారన్నారు. ఆయన సూచనతో తాను ఆ ఆలోచన నుంచి విరమించుకున్నానని ఆమె వెల్లడించారు.

ఇంతకాలం జగన్ ముఖ్యమంత్రి కావాలని కోరుతూ బహిరంగంగా ప్రకటనలు చేసిన సురేఖ సోమవారం రోశయ్యకు అనుకూలంగా మాట్లాడటంతో మీడియాలో విభిన్న కథనాలు వచ్చాయి. దీనిపై ఆమె మంగళవారం వివరణ ఇచ్చారు.

వెబ్దునియా పై చదవండి