సమైక్యాంధ్రకు అనుకూలంగా ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి నిర్ణయం తీసుకున్నట్టు మీడియాలో వార్తలు రావడంతో ఆ పార్టీకి చెందిన తెలంగాణ ప్రాంత నేతలు భగ్గుమన్నారు. పలు జిల్లాలకు చెందిన ప్రరాపా అధ్యక్షులు తమ పార్టీ పదవులకు రాజీనామా చేశారు. ఆ వెనువెంటనే హైదరాబాద్‌కు చేరుకుని చిరంజీవిని నిలదీశారు.
అయితే, సామాజిక తెలంగాణ ఏర్పాటుకు గతంలో ప్రరాపా చేసిన తీర్మానాన్ని ఉపసంహరించుకున్నట్టు వస్తున్న వార్తల్లో నిజం లేదని స్పష్టం చేశారు. తాను ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, అందువల్ల ఆందోళన చెందవద్దని తెలంగాణ నేతలకు చిరంజీవి భరోసా ఇచ్చారు. అయినప్పటికీ.. తెలంగాణ ప్రాంతాల్లో ప్రరాపా కార్యాలయాలపై దాడులు జరుగుతున్నాయి.
ముఖ్యంగా.. కుటుంబ హీరోలు నటించిన చిత్రాల ప్రదర్శనను తెలంగాణ రాష్ట్ర సమితితో పాటు ప్రరాపా కార్యకర్తలు అల్లు అర్జున్ అభిమాన సంఘాల సభ్యులు అడ్డుకున్నారు. తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లో ప్రదర్శిస్తున్న ఆర్య-2, మగధీర చిత్రాల ప్రదర్శనను నిలిపి వేశారు.
ఇదిలావుండగా.. తెలంగాణ ప్రాంతానికి చెందిన ప్రరాపా నేత డాక్టర్ శ్రావణ్ మీడియాతో మాట్లాడుతూ, చిరంజీవి సమైక్యాంధ్రకు మద్దతుగా నిర్ణయం తీసుకోలేదని, రాజకీయ వ్యవహారాల కమిటీలో అలాంటి చర్చ కూడా ఏదీ జరగలేదని పేర్కొన్నారు. చిరంజీవిపై ఒత్తిడి పెరుగుతున్నప్పటికీ ఆయన అలాంటి నిర్ణయం ఏదీ తీసుకోలేదని చెప్పారు.
తమ పార్టీ విధానం ప్రకారం ఇప్పటికీ సామాజిక తెలంగాణకే కట్టుబడి ఉన్నామని శ్రావణ్ స్పష్టం చేశారు. అన్ని ప్రాంతాలవారికీ అభిమాన నాయకుడిగా, అందరివాడుగానే చిరంజీవి ఉంటారని, కొందరివాడుగా మిగిలిపోరని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అన్ని ప్రాంతాల వారికీ చిరంజీవి సరైన న్యాయం చేస్తారన్న ధీమాను శ్రావణ్ వ్యక్తం చేశారు.