ఎమ్మెల్యేలు సంతకాలు చేస్తే తెలంగాణ వచ్చేస్తుందా..!?
294 మంది శాసనసభ్యులు సంతకాలు చేసినా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాదని రాజమండ్రి పార్లమెంట్ సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్ వెల్లడించారు. తెలంగాణకు రాష్ట్రంలోని శాసనసభ్యులతో ఎలాంటి సంబంధం లేదన్నారు. ప్రత్యేక తెలంగాణ సాధించాలంటే పార్లమెంట్‌లో బిల్లు ప్రవేశ పెట్టాలని ఉండవల్లి పేర్కొన్నారు.
పోలవరం ప్రాజెక్టుపై విలేకరులతో మాట్లాడిన ఉండవల్లి, తెలంగాణ విషయంపై నోరు విప్పారు. ఇందులో భాగంగా తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టి దాని ఆమోదం కోసం కూడా చాలా ప్రక్రియ ఉంటుందన్నారు. కాంగ్రెస్ పార్టీ ఒక్కటే తెలంగాణను ఆమోదిస్తే సరిపోదని, కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతిస్తున్న అన్ని పార్టీలు కూడా తెలంగాణ బిల్లుకు మద్దతు ఇస్తే కానీ తెలంగాణ సాధ్యపడదని ఉండవల్లి తెలియజేశారు.