'గేమ్ ఛేంజర్‌'కు రూ.600 - 'డాకు మహారాజ్‌'కు రూ.500 బెనిఫిట్ షో టిక్కెట్ ధర ఖరారు!

ఠాగూర్

ఆదివారం, 5 జనవరి 2025 (15:30 IST)
రామ్ చరణ్ హీరోగా నటించిన "గేమ్ ఛేంజర్" చిత్రం ఈ నెల 10వ తేదీన విడుదలకానుంది. అలాగే, సీనియర్ నటుడు బాలకృష్ణ నటించి "డాకు మహారాజ్" మూవీ 12వ తేదీన ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ రెండు చిత్రాలకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. బెనిఫిట్ షోలకు అనుమతి ఇస్తూనే టిక్కెట్ రేటును కూడా పెంచుకునేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో 'గేమ్ ఛేంజర్' టిక్కెట్ ధర రూ.600గాను, 'డాకు మహారాజ్' టిక్కెట్ ధర రూ.500గా ఖరారు చేసింది. ఈ మేరకు తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. 
 
శంకర్ దర్శకత్వం వహించిన 'గేమ్ ఛేంజర్‌'ను భారీ బడ్జెట్‌తో రూపొందించారు. సంక్రాంతి కానుకగా జనవరి 10న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ నేపథ్యంలో, బెనిఫిట్ షో టికెట్ రూ.600 చొప్పున విక్రయించుకునేందుకు అనుమతి ఇచ్చింది. ఈ నెల 9వ తేదీ అర్థరాత్రి ఒంటి గంటకు 'గేమ్ చేంజర్' బెనిఫిట్ షోలు వేయనున్నారు. ఈ నెల 10న ఆరు షోలకు అనుమతి ఇస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
 
మల్టీప్లెక్స్ థియేటర్లలో టికెట్‌పై అదనంగా రూ.175, సింగిల్ స్క్రీన్ థియేటర్లలో టికెట్‌పై అదనంగా రూ.135 వరకు పెంచుకోవచ్చని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇవే ధరలతో జనవరి 11 నుంచి 23 వరకు రోజుకు ఐదు షోలు ప్రదర్శించుకునేందుకు కూడా ఏపీ ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది
 
అలాగే ఈ చిత్రానికి అదనపు షోలకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. డాకు మహారాజ్ సినిమాను జనవరి 12వ తేదీ ఉదయం 4 గంటలకు స్పెషల్ బెనిఫిట్ షోకు అనుమతించింది. ఈ షోకి టికెట్ రేటును రూ.500 (జీఎస్టీతో కలిపి)గా నిర్ణయించింది. మొదటి రోజు నుంచి జనవరి 25 వరకు రోజుకు ఐదు షోలకు అనుమతి ఇచ్చింది. ఈ షోలకు మల్టీప్లెక్సుల్లో టికెట్‌పై రూ.135, సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రూ.110 పెంపునకు అనుమతి ఇవ్వడం జరిగింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు