2జీ స్పెక్ట్రమ్‌పై దేశ ప్రధాని మన్మోహన్ సింగ్ మౌనం వహించడం దేశానికి శాపమైందని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. 2జీ స్పెక్ట్రమ్ మాత్రమే గాకుండా కోట్ల విలువ చేసే అవినీతి కుంభకోణాలపై ప్రధాని నోరు విప్పట్లేదని బాబు చెప్పారు. మూడు రోజుల పర్యటన నిమిత్తం ఆయన గురువారం ఉదయం విశాఖ వచ్చారు.
ఈ సందర్భంగా చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ.. భారీ అవినీతి కుంభకోణాలు జరుగుతుంటే పాలకులు మీనమేషాలు లెక్కిస్తున్నారన్నారు. అవినీతిపై దేశ ప్రధాని మన్మోహన్ సింగ్, యూపీఏ ఛైర్ పర్సన్ సోనియాగాంధీ తక్షణమే సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
అవసరం అయితే అవినీతిపై జాతీయస్థాయిలో ఉద్యమం చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు చంద్రబాబు ప్రకటించారు. దేశంలో ఒక్క 2జీ కుంభకోణమే మాత్రమే కాదు.. ఎంతోమంది అవినీతి రాజాలు పెరిగిపోయారని బాబు అన్నారు.