ఎంపీ ఎమ్మెల్యే పదవులకు జగన్-విజయమ్మ రాజీనామా!!

అనుకున్నట్టుగానే జగన్నాటకం క్లైమాక్స్‌కు చేరింది. కడప ఎంపీ పదవికి రాజీనామా చేయాలని వైఎస్.జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ఇందుకోసం ఆయన సోమవారం సాయంత్రం ఢిల్లీకి వెళ్లాలని తొలుత భావించారు. అయితే, ఈ పర్యటనను ఆయన రద్దు చేసుకున్నారు. తన బాబాయి వైఎస్.వివేకానంద రెడ్డికి మంత్రిపదవి ఖాయమని తేలిపోవడంతో ఆయన ఈ తరహా నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ఎందుకంటే.. తనను, తన కుటుంబాన్ని ఏకాకి చేసేందుకు కాంగ్రెస్ అధిష్టానమే బాబాయి వివేకాను ఒక పావుగా వాడుకున్నారని జగన్ తన సన్నిహితుల వద్ద వాపోతున్నారు. ముఖ్యంగా, తీవ్ర మనస్తాపం చెందినట్టు సమాచారం.

అలాగే, పులివెందుల శాసనసభ సభ్యురాలు, దివగంత ముఖ్యమంత్రి వైఎస్ సతీమణి వైఎస్.విజయలక్ష్మి కూడా తన సభ్యత్వానికి రాజీనామా చేయనున్నారు. తల్లీ కొడుకుల ఈ నిర్ణయానికి కూడా వచ్చినట్టు సన్నిహిత వర్గాలు సమాచారం. తొలుత జగన్ రాజీనామా చేసిన తర్వాతే విజయలక్ష్మి రాజీనామా చేసే అవకాశాలు ఉన్నాయి. వీరిద్దరు కూడా బుధవారం రాజీనామాలు చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

అయితే, రాజీనామా వ్యవహారంలో ఆచితూచి అడుగులు వేయాలని జగన్‌కు సన్నిహితులు సూచించినట్టు తెలుస్తోంది. వాస్తవానికి ఆదివారం సాయంత్రమే జగన్ రాజీనామా విషయాన్ని తన సన్నిహితుల వద్ద ప్రస్తావించారు. కానీ, బుధవారం వరకు వేచి చూడాలని సన్నిహితులు కోరారు. వైఎస్‌ వివేకాకు మంత్రివర్గంలో స్థానం కల్పిస్తున్నట్టు నిర్ధారించుకున్న తర్వాతే తుది నిర్ణయం తీసుకోవాలని చెప్పడంతో జగన్ మరో 48 గంటల పాటు వేచి చూసే ధోరణిని అవలంభించాలని నిర్ణయించారు.

వెబ్దునియా పై చదవండి