చిరంజీవిని ఉప ముఖ్యమంత్రి చేయాల్సిందే: ప్రరాపా నేతలు

రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వానికి తమ మద్దతు కావాలంటే పార్టీ అధినేత చిరంజీవికి కేంద్ర మంత్రి పదవి లేదా డిప్యూటీ సీఎం పదవిని ఇవ్వాల్సిందేనని ప్రజారాజ్యం పార్టీ డిమాండ్ చేస్తోంది. ఈ విషయాన్ని ఆ పార్టీ సీనియర్ నేత, అనకాపల్లి ఎమ్మెల్యే గంటా శ్రీనివాస రావు సోమవారం మీడియాకు వెల్లడించారు. చిరంజీవిని డిప్యూటీ సీఎం చేయాలన్నది తమ అభిప్రాయం కాదని, కార్యకర్తల డిమాండ్‌గా ఆయన పేర్కొనడం గమనార్హం.

కొత్త మంత్రివర్గంలో వైఎస్.జగన్మోహన్ రెడ్డి వర్గానికి చెక్ పెట్టాలని కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. తద్వారా ఉత్పతన్నయమ్యే పరిణామాలను ఎదుర్కొనేందుకు వీలుగా ప్రరాపాను ప్రభుత్వంలో భాగస్వామ్యం చేసేందుకు వీలుగా మంత్రిపదవులు ఇవ్వజూపింది. ఈ విషయంపై ఒక స్పష్టమైన నిర్ణయానికి ఇరు పార్టీల నేతలు వచ్చాయి.

ఈ నేపథ్యంలో ప్రభుత్వంలో చేరిక అంశంపై ముఖ్యమంత్రి కేకేఆర్, ప్రరాపా అధినేత చిరంజీవిలు సోమవారం హైదరాబాద్‌లో భేటీకానున్నారు. ఈ సమావేశానికి ముందుగా ప్రరాపా నేతలతో చిరంజీవి తన నివాసంలో భేటీ అయ్యారు. ఇందులో ఎన్ని మంత్రి పదవులు కావాలి, ఎలాంటి శాఖలు కావాలన్న అంశంపై చర్చించారు.

ఈ సమావేశం అనంతరం ఎమ్మెల్యే గంటా మాట్లాడుతూ.. తమకు ఆరు మంత్రి పదవులు కావాలని కోరనున్నట్టు చెప్పారు. అలాగే, చిరంజీవికి కేంద్ర మంత్రి పదవి లేదా డిప్యూటీ సీఎం ఇవ్వాలని కార్యకర్తలు కోరుతున్నారని చెప్పారు. కాగా, ఈ సమావేశానికి 12 మంది ఎమ్మెల్యేలు మాత్రమే హాజరైనట్టు సమాచారం.

వెబ్దునియా పై చదవండి