కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి పదవిని చేపట్టిన తరువాత రోజురోజుకీ రాష్ట్ర రాజకీయాల్లో మార్పు చోటుచేసుకుని చివరికి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆయన తల్లి విజయలక్ష్మి రాజీనామాలకు దారితీసింది. ఈ పరిణామాలతో కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షోభంలో పడిపోయే అవకాశమున్నట్లు వార్తలు అందుతున్నాయి.
రాజీనామా చేసిన వైఎస్ జగన్ నేరుగా కడపలోని తన తండ్రి సమాధి ఇడుపలపాయకు బయలుదేరి వెళ్లారు. సందర్శన ముగిసిన పిదప తన సన్నిహితులు, కర్నాకట మంత్రులు అయిన గాలి జనార్థన్ రెడ్డితో సమావేశమయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
పైకి ప్రభుత్వాన్ని కూలగొట్టే ఆలోచన, అటువంటి పనులు చేయనని జగన్ చెపుతున్నప్పటికీ ఆయన సన్నిహిత వర్గం మాత్రం ఆ పనిలో పూర్తిగా నిమగ్నమై ఉన్నట్లు సమాచారం. మరోవైపు ఈ అవకాశాన్ని తమకు అనుకూలంగా మలచుకునేందుకు భాజపా చూస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.
ఇదిలావుండగా జగన్ రాజీనామా, తదనంతర పరిస్థితులను ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి నిశితంగా గమనిస్తున్నారు. ఇప్పటికే ఆయా జిల్లాల్లోని ఎమ్మెల్యేలతో టచ్ లో ఉన్నట్లు సమాచారం. జగన్ రాజీనామాతో కాంగ్రెస్ పార్టీ సర్వనాశనమైపోతుందని అంటున్న వైఎస్ జగన్ వర్గం భవిష్యత్తులో ఆ పార్టీపై ఎటువంటి వైఖరిని ప్రదర్శిస్తారో చూడాలి