జగన్ ఎఫెక్ట్‌.. రాష్ట్ర కాంగ్రెస్‌లో చీలిక ఖాయం: వెంకయ్య

కడప ఎంపీ వైఎస్.జగన్మోహన్ రెడ్డి రాజీనామా రాష్ట్ర కాంగ్రెస్‌కు పెద్ద ఎదురుదెబ్బలాంటిదని, మున్ముందు ఖచ్చితంగా చీలిక తప్పదని భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత ఎం.వెంకయ్య నాయుడు జోస్యం చెప్పారు. అయితే, మీడియా ముందు కాంగ్రెస్ నేతలు ప్రగల్భాలు పలకడం సహజమేనన్నారు.

రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ రాజకీయాలపై వెంకయ్య ఢిల్లీలో మాట్లాడుతూ యువనేత వైఎస్.జగన్మోహన్‌ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడం ఆ పార్టీకి తప్పకుండా పెద్ద ఎదురుదెబ్బేనన్నారు. బయటికి ఏదో ఒకటి చెప్పాలి కాబట్టి ఏం జరగదని, ప్రభావం ఉండదని కాంగ్రెస్ నాయకులు చెప్పడం పొరపాటేనన్నారు.

పార్టీకి జగన్ రాజీనామా చేయడం వల్ల కాంగ్రెస్‌లో చీలిక ఖాయమన్నారు. వైఎస్.రాజశేఖర్ రెడ్డికి రాష్ట్రంలో బలమైన వర్గం, అనుచరగణం ఉన్నారన్నారు. వీరంతా జగన్‌కు పూర్తి అండదండగా ఉంటారన్నారు. అయితే, ప్రస్తుతం అధికారంలో ఉన్నందున్న వైఎస్ వర్గీయులు బయటపడేందుకు వెనుకంజ వేయవచ్చన్నారు.

వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి ఖచ్చితంగా రాష్ట్ర కాంగ్రెస్ నాటికి ఖచ్చితంగా రెండుగా చీలడం ఖాయమన్నారు. కాంగ్రెస్‌లో చీలిక వస్తే తాము సంతోషిస్తామన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌వారందరినీ ఐక్యంగా ఉంచే శక్తి లేదని చెప్పారు. దేశంలో సోనియా కాంగ్రెస్‌ని గెలిపించకపోయినా, ఆమెకు ఆకర్షణ లేకపోయినా పార్టీని ఐకమత్యంతో ఉంచారన్నారు.

రాష్ట్ర విషయానికి వస్తే అలా కలిపివుంచే ఆకర్షణగల నాయకుడు ప్రస్తుతం రాష్ట్ర కాంగ్రెస్ లేరన్నారు. కాంగ్రెస్ పార్టీకి అత్యధిక స్థానాలు అందించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కాంగ్రెస్ అధిష్టానం చిన్నచూపు చూస్తుందనే అభిప్రాయం ప్రజల్లో మెల్లగా బలపడుతోందన్నారు. ఇదే ఆ పార్టీకి పెనుముప్పు కలిగించవచ్చని వెంకయ్య తెలిపారు.

వెబ్దునియా పై చదవండి