జగన్ కొత్త రాజకీయ పార్టీ పేరు వైఎస్ఆర్ రాష్ట్రీయ కాంగ్రెస్!!!

కడప ఎంపీ వైఎస్.జగన్మోహన్ రెడ్డి స్థాపించనున్న కొత్త రాజకీయ పార్టీ పేరుపై తీవ్రస్థాయిలో చర్చ జరుగుతోంది. ఇప్పటికే పలు పేర్లను పరిశీలిస్తున్నారు. వీటిలో ప్రముఖంగా వైఎస్ఆర్ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్, వైఎస్ఆర్ రాష్ట్రీయ కాంగ్రెస్ వంటి పేర్లను పరిశీలిస్తున్నారు.

అయితే, వైఎస్ఆర్ పార్టీ పేరు ప్రజల్లోకి అంతగా చొచ్చుకుని పోయే అవకాశం లేదని స్వయంగా జగనే అభిప్రాయపడినట్టు తెలుస్తోంది. అదేసమయంలో కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా ఉండేలా ఇటు కాంగ్రెస్, అటు వైఎస్సార్ పేరు కలిసివచ్చేలా పేరు ఉండాలని సూచించినట్టు సమాచారం.

దీంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేదా వైఎస్ఆర్ రాష్ట్రీయ కాంగ్రెస్ పార్టీ అనే రెండు పేర్లను పరిశీలిస్తున్నట్టు సమాచారం. ఈ రెండింటింలో వైఎస్ఆర్ రాష్ట్రీయ కాంగ్రెస్ పార్టీ పేరును ఖరారు చేసే అవకాశాలు మెండుగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇదే విషయాన్ని జగన్ సన్నిహితులు సూచన ప్రాయంగా వెల్లడిస్తున్నారు.

ఇకపోతే.. కొత్త పార్టీలో యువత, శ్రామికులు, రైతుల పేర్లు కలిసి వచ్చేలా వైఎస్ఆర్ పేరును జోడిస్తున్నారు. ఈ పార్టీ ఏర్పాటు తర్వాత తెలుగువారి ఆత్మగౌరవ నినాదం అంశాన్ని కూడా తమ ప్రధాన అజెండాలో ఒకటిగా చేర్చనున్నారు.

వెబ్దునియా పై చదవండి