అన్నయ్య కలను నిజం చేయడానికే మంత్రి పదవి చేపట్టా..!!

తన అన్నయ్య దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వై.ఎస్‌. రాజశేఖర్‌రెడ్డి కలలను నిజం చేయడానికే తాను మంత్రి పదవిని ఆశించినట్లు ఇటీవలే రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన వై.ఎస్‌. వివేకానందరెడ్డి అన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి కొత్త మంత్రివర్గంలో బాధ్యతలు స్వీకరించిన అనంతరం శుక్రవారం ఆయన వైఎస్ఆర్ జిల్లాకు చేరుకున్నారు.

ఈ సందర్భంగా రాష్ట్ర అతిథి గృహంలో ఆయన విలేఖరులతో మాట్లాడుతూ.. "వ్యవసాయం దండగ కాదు పండుగ" అని చెప్పిన తన అన్న వైఎస్‌ఆర్ ఆశయాలను నిరూపించేందుకు తన వంతు కృషి చేస్తానని వివేకా చెప్పారు. వ్యవసాయ రంగంలో రైతుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యతనిస్తానని, వ్యవసాయ రంగ అభివృద్ధికి వైఎస్ఆర్ రూపొందించిన ప్రణాళికనే తాను కూడా రూపొందిస్తానని తెలిపారు.

జిల్లాలోని ఇరిగేషన్‌కు అధిక ప్రాధాన్యతనిస్తానని, సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయడానికి 900 కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయని, ఈ నిధుల మంజూరుకు ప్రభుత్వంతో చర్చలు జరుపుతామని వివేకానంద రెడ్డి చెప్పారు. 2009లో పంటల భీమా మొత్తం రూ. 112 కోట్లు నిధులు విడుదలయ్యాయని ఆయన గుర్తు చేశారు. వచ్చే వారంలోగా ఈ బీమాను రైతుల ఖాతాల్లో జమచేస్తామని ఆయన తెలిపారు.

వెబ్దునియా పై చదవండి