ఆ ఇద్దరిలో శాసనసభ స్పీకర్ పదవి ఎవరిని వరిస్తుందో..?!
ఒకవైపు మంత్రులు అసంతృప్తితో శాఖలను మార్చండి బాబోయ్ అంటూ కొత్త సీఎం కిరణ్ కుమార్ రెడ్డికి తలనొప్పిగా మారిన నేపథ్యంలో మరోవైపు శాసనసభ స్పీకర్, డిప్యూటీ సీఎం, పీసీసీ చీఫ్‌ను ఎంపిక చేయడంలో కాంగ్రెస్ అధిష్టానం తలమునకలైంది. ఇప్పటికే డిప్యూటీ సీఎం పదవికి గీతారెడ్డి, రాజనర్సింహలు పోటీపడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
అలాగే పీసీసీ ఛీఫ్ పదవిపై మాజీ మంత్రి షబ్బీర్ అలీ కన్నేసినట్లు సమాచారం. ఇందుకోసం కొద్దిరోజులుగా ఢిల్లీలో మకాం వేసిన షబ్బీర్ అలీ పీసీసీ పదవికోసం ప్రయత్నాలు సాగిస్తున్నారు. అయితే తాజాగా పీసీసీ చీఫ్ పదవికి మర్రి శశిధర రెడ్డి పేరు తెరపైకి వచ్చింది. శనివారం డీఎస్ కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని, అహ్మద్ పటేల్‌ను కలవడం ద్వారా మర్రిని పీసీసీ చీఫ్‌గా నియమించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.
మరోవైపు శాసనసభ స్పీకర్ పదవి ప్రస్తుతం డిప్యూటీ స్పీకర్‌గా ఉన్న నాదెండ్ల మనోహర్‌కు దక్కుతుందా లేదా నల్లగొండా జిల్లా శాసససభ్యుడు ఉత్తమ్ కుమార్ రెడ్డికి దక్కే అవకాశం ఉందని తెలుస్తోంది.
డిసెంబరు పదినుంచి శాసనసభ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో స్పీకర్ పదవి ఎవరికిస్తారనేది ఇంకా తేలలేదు. నాదెండ్ల మనోహర్ లేదా ఉత్తమ్ కుమార్‌లలో ఎవరికైనా ఒకరికి స్పీకర్ పదవిని అప్పగించబోతున్నట్లు కాంగ్రెస్ శ్రేణుల సమాచారం.